ఇవాళ్టి నుంచి న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 జరుగనుంది.
మూడు రోజుల పాటు భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శన కార్యక్రమం కొనసాగనుంది.
వాణిజ్యం, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, రోడ్డు రవాణా, రహదారులు, పెట్రోలియం, సహజ వాయువు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనంతో సహా వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల మద్దతుతో నిర్వహించబడిన ఈ ఎక్స్పో ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలు ఒక చోట కీలక చర్చలు జరపనుంది. ఈ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
అయితే, ప్రస్తుతం ప్రపంచంలోని మూడవ-అతిపెద్ద ప్రయాణీకుల వాహన మార్కెట్, రెండవ-అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్, ప్రపంచ ఆటోమొబైల్ తయారీ హబ్‌గా మారడానికి వ్యూహాత్మకంగా తన స్థానాన్ని భారతదేశం రూపొందిస్తుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ , ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తో కలిసి నాస్కం వంటి ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక సంస్థల మద్దతుతో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక, ఈ ఈవెంట్లో 28 ప్రముఖ వాహన తయారీదారులు పాల్గొనబోతున్నాయి. మారుతి సుజుకి , మహీంద్రా, స్కోడా, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్య్లూ, హ్యుందాయ్ వంటి హెవీవెయిట్లు తమ తాజా ఆఫర్లను ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నాయి. అలాగే, ద్విచక్ర వాహన తయారీదారులలో హీరో మోటోకార్ప్, హోండా, ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో, యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, సుజుకి, టీవీఎస్ మోటార్ కంపెనీ, టోర్క్ మోటార్స్ తో పాటు వార్డ్ విజార్డ్ వంటి కంపెనీలు.. ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొననున్నాయి. అలాగే, అశోక్ లేలాండ్, వోల్వో ఐచర్ వంటి వాణిజ్య వాహన తయారీదారులు తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించడానికి ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నారు. అదనంగా, ప్రముఖ ఉక్కు తయారీదారులతో పాటు 15 కంటే ఎక్కువ టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీలు ఉత్సాహభరిత వాతావరణానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.