ముంబయి: స్టాక్ మార్కెట్ లో లాభాల పరంపరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఒక్క సెషన్‌లో ఏకంగా రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం రూ.454.4 లక్షల కోట్ల నుంచి రూ.446.4 లక్షల కోట్లకు తగ్గింది.
సెన్సెక్స్ ఉదయం 81,585.06 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. చివరికి 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 269.95 పాయింట్ల నష్టంతో 24,530.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది. నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లాభాల్లో కొనసాగగా.. టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా నష్టపోయాయి.