విద్యుత్ వాహనాల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు, వాటి నిర్వాహణతో పోల్చుకుంటే విద్యుత్ వాహనాలు మెరుగ్గా ఉండడంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో 1,52,610 విద్యుత్ వాహనాల అమ్మకాలు జరిగాయి. పెట్రోల్ వాహనాలతో పోల్చితే విద్యుత్ వాహనాల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ పెట్రోల్ ఖర్చుతో పోల్చితే విద్యుత్ వాహనాలే మురుగని కస్టమర్లు భావిస్తున్నారు.
అయితే విద్యుత్ వాహనాల్లో వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీల రేట్లు వినియోగదారులకు మున్ముందు భారంగా మారే అవకాశం ఉందని ఆటో ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని అంశాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వీరు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల్లో వినియోగిస్తున్న బ్యాటరీల ధరలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని బ్లూమ్‌బర్గ్ ఎన్‌ఈఎఫ్ సూచిస్తోంది.
లిథిలియం-అయాన్ బ్యాటరీ మొత్తం వాహనం ధరలో ఇదే అధిక వాటా కలిగి ఉంది. ఒక కిలోవాట్ అవర్ బ్యాటరీ ధర 161 డాలర్లుగా ఉండేది. ఇది 2022 నాటికి 14 శాతం తగ్గి 139 డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం జనవరి నుంచి వీటి ధరలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. లిథియం ఆయాన్ బ్యాటరీల్లో వాడే ముడి పదర్ధాల లభ్యత పెరగడం, బ్యాటరీల ఉత్పత్తి కూడా పెరగడం వంటి కారణాల మూలంగా వీటి ధరలు తగ్గుతున్నాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
2023లో కిలోవాట్ అవర్ ధర 133 డాలర్లకు తగ్గింది. 2027 నాటికి ఒక కిలోవాట్ ధర 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న కార్లలో చాలా వరకు 30-40 కిలోవాట్ అవర్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. హై ఎండ్ విద్యుత్ కార్లలో 50-60 కిలోవాట్ అవర్ బ్యాటరీలను కూడా వినియోగిస్తున్నారు. అధిక రేంజ్ ఇచ్చేందుకు అధిక సామర్ధ్యం ఉన్న బ్యాటరీలను వినియోగించాల్సిన అవసరం ఉంటుంది.
కస్టమర్లు అధిక రేంజ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం 30-40 కిలోవాట్ అవర్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే కస్టమర్లు 3 నుంచి 4.5 లక్షల వరకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. కార్ల తయారీదారులు బ్యాటరీ లైఫ్ టైమ్ తరువాత రీప్లేస్ చేసేందుకు ఒక కిలోవాట్ అవర్‌కు 15,00-20,000 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. మన దేశంలో కార్ల కంపెనీలు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ రేటును మాత్రం ఎక్కడా వెల్లడించడంలేదు.
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా నెక్సన్ విద్యుత్ కారు 14.75 నుంచి 19.94 లక్షల ధరలో లభిస్తుంది. తాజాగా టాటా మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన ఈ కారులో 40.5 కిలోవాట్ అవర్, 30 కిలోవాట్ అవర్ బ్యాటరీలను ఉపయోగిస్తోంది. కిలోవాట్ అవర్ రేటు 133 డాలర్లుగా లెక్కిస్తే 3.33 లక్షల నుంచి 4.43 లక్షల వరకు బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌కు కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. వాహనంలో వినియోగించే బ్యాటరీ సామర్ధ్యాన్ని బట్టి రీప్లేస్‌మెంట్‌కు అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది.