Friday, November 22, 2024

Export | ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం

దేశంలో ఉల్లి నిల్వలు, ఉత్పత్తి తక్కువగా ఉన్నందున గతంలో ప్రకటించినట్లుగానే మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర ప్రకటించింది. 2023, డిసెంబర్‌ 8న కేంద్రం ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం విధించింది. ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయలేదని ఇది కొనసాగుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఉల్లి దేశీయంగా తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయనుందని వార్తలు వచ్చాయి. దీంతో దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌ మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో ధరలు పెరిగాయి. క్వింటాల్‌ ఉల్లి ధర 1,280 రూపాయల నుంచి 1,800 రూపాయలకు పెరిగింది. హోల్‌సేల్‌లో కిలో 40.62 రూపాయలకు చేరింది. రబీ సీజన్‌లో మహారాష్ట్రలో ఉల్లి పంట దిగుబడి బాగా తగ్గుతుందని అంచనా. దీంతో రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

2023 రబీ సీజన్‌లో ఉల్లి దిగుబడులు 22.7 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి ఉల్లి ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో ఈ రబీ సీజన్‌లో దిగుబడులు తగ్గుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీని వల్ల మార్చి 31 తరువాత కూడా ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగించే అవకాశం ఉంది. ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూప్‌ అనుమతితో స్నేహపూర్వక దేశాలకు పరిమితంగా ఎగుమతులు చేస్తున్నారు.

ఖరీఫ్‌ వరకు కొరత తప్పదు…

దేశంలో ప్రస్తుతం రబీ సీజన్‌లో ఆశించిన మేర ఉల్లి దిగుబడులు లేకపోవడంతో వచ్చే ఖరీఫ్‌ వరకు కొరత తప్పదని అంచనా వేస్తున్నారు. ఎగుమతులపై నిషేధం మూలంగా ధరలు కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రబీలో కనీసం 30 శాతం ఉల్లి సాగు తగ్గిందని వ్యవసాయ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కర్నాటకలో తగినంత వర్షపాతం లేకపోవడంతో పంట సాగుపై ప్రభావం పడింది. ఫలితంగా దిగుబడులు 13 శాతానికి పైగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఉల్లి నిల్వలు, దిగుబడులపై సరైన అంచనా లేకుండా ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తే సమస్య తీవ్రంగా మారుతుందని ప్రధానమైన ఉల్లి ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

- Advertisement -

సోమవారం నాడు వ్యాపారుల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కలిసి ఇప్పటికే 3 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు చేసినందున మళ్లి కేజీ ఉల్లి 35- 40 రూపాయలకు పెరిగిందని తెలిపారు. ఇది నాసిక్‌లో 50-60 రూపాయలకు చేరిందని తెలిపారు. రంజాన్‌ వస్తున్నందు మార్చిలో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని ఈ ట్రేడర్స్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రుల బృందం మూడు లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వడం పట్ల ఈ వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. 250-300 టన్నుల వరకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని వీరు స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లిగడ్డలకు తీవ్రమైన కొరత ఏర్పడిందని ఈ ట్రేడర్స్‌ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో ఉల్లి ప్రధాన ఎగుమతిదారుగా ఇండియా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఉల్లి టన్నుకు 1000-1400 డాలర్ల వరకు ఉందని, ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న ఉల్లి గడ్డలు టన్నుకు 350 డాలర్లలో లభిస్తున్నాయని తెలిపారు. కొంత మంది వ్యాపారులు టామాటా ఇతర కూరగాయల పేరుతో తప్పుడు లేబుల్స్‌తో ఎగుమతులు చేస్తున్నారని వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement