కేంద్ర ప్రభుత్వం పేదల కోసం తీసుకు వచ్చిన ఆయూష్‌మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనలు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికలు వస్తున్నందున పేద వర్గాలను మరింత ఆకట్టుకునేందుకు ఈ స్కీమ్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని భావిస్తోంది.
క్యాన్సర్, ట్రాన్స్‌ఫ్లాంటేషన్ వంటి అత్యధికంగా ఖర్చు అయ్యే వాటిని దీని పరిధిలోకి తీసుకురానున్నారు. ఆయూష్‌మాన్ భారత్‌ను కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టింది. కాన్సర్, ట్రాన్స్‌ఫ్లాంటేషన్ వంటి చికిత్సలకు ఎక్కువ ఖర్చవుతోంది. ప్రస్తుతం ఉన్న కవరేజీ 5 లక్షలు సరిపోవడంలేదని, దీన్ని పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఆరోగ్య బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచుతారని ఆరోగ్య శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆయూష్‌మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం ఏజేవై) లద్దిదారుల సంఖ్యను కూడా రెట్టింపు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయిచింది. ఈ స్కీమ్‌ను కిసాన్ సమ్మాన్ నిధి లద్దిదారులతో పాటు, భవన నిర్మాణ కార్మికులు, బొగ్గు గనులేతర కార్మికులు, ఆషా వర్కర్లకు వర్తింప చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ ఇస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా స్కీమ్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆయూష్‌మాన్ భారత్‌లో ప్రస్తుతం 55 కోట్ల మంది లద్ధిదారులుగా ఉన్నారు.
వీరు 12 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి. అదనపు లద్దిదారుల ఖర్చును భరిస్తున్నాయి. ఈ ఆరోగ్య బీమా ప్రారంభమైన నాటి నుంచి 2023 డిసెంబర్ 20 నాటికి 28.45 కోట్ల ఆయూష్‌మాన్ భారత్ కార్డులు జారీ చేశారు. ఇందులో 9.38 కోట్ల కార్డులు 2023లోనే జారీ చేశారు. 10 లక్షలకు పెంచినందున కేంద్రం ఈ స్కీమ్‌కు అదనంగా సంవత్సరానికి 12,076 కోట్లు కేటాయించనుంది. ఈ స్కీమ్‌కు 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో 7,200 కోట్లు కేటాయించింది. 2024-25 బడ్జెట్‌లో కనీసం 15 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.