Monday, November 11, 2024

Aviation | జులైలో పుంజుకున్న విమానయానం..

భారత విమానయాన సంస్థల్లో 2024 జులైలో మొత్తంగా 1.29 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 7.30శాతం అధికం. ఈ మేరకు డీజీసీఏ సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా విమానయానంలో వృద్ధిని సూచించే కీలక విషయాలను వెల్లడించింది.

అయితే, ఈ ఏడాది జూన్‌లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన 1.32 కోట్ల మందితో పోల్చితే జులైలో విమానాల్లో రద్దీ కాస్త తగ్గింది. ప్రముఖ ఎయిర్‌వేస్‌ ఇండిగో ఎయిర్‌ ట్రాఫిక్‌లో లీడర్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. జులైలో దాని మార్కెట్‌ వాటా 62శాతానికి పెరిగింది.

అదే సమయంలో ఎయిర్‌ ఇండియా వాటా 14.30 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం జులై నెలలో విస్తారాకు సంబంధించిన దేశీయ మార్కెట్‌ వాటా 10శాతాన్ని చేరుకుంది. ఏఐఎక్స్‌ కనెక్ట్‌, స్పైస్‌జెట్‌ వాటా వరుసగా 4.50 శాతం, 3.10శాతంగా నమోదయ్యాయి.

అలాగే ఆకాశా, అలయన్స్‌ ఎయిర్‌ వాటాలు 4.70, శాతం, 0.90శాతంగా ఉన్నాయి. జూన్‌-జులైలో దేశీయ విమానయాన సంస్థల్లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 8,81,94,000 నుంచి 9,23,35,000గా ఉంది. దీన్నిబట్టి వార్షిక వృద్ధి 4.7శాతం, నెలవారీ వృద్ధఠి 7.33శాతం నమోదైంది. అలాగే జులైలో 1,29,87,000కి చేరుకుంది.

1114 మందికి బోర్డింగ్‌ నిరాకరించబడింది. విమానయాన సంస్థలు పరిహారం, సౌకర్యాల కోసం రూ.112.71 కోట్లు వెచ్చించాయి. విమానాల ఆలస్యానికి జులైలో 3,20,302 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఇక ప్రతి 10వేల మంది ప్రయాణికులకు ఫిర్యాదుల సంఖ్య 0.84శాతంగా ఉందని డీజీసీఏ నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement