Wednesday, November 27, 2024

చమురు ధరలు పెరగడంతో.. విమానయాన సంస్థల ఇంధన వడ్డన

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధన(ఏటీఎఫ్‌) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచుతున్నాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో విమాన ఇంధన వ్యయం 40 శాతం వరకు ఉంటుంది. ఇంధన ధరలు పెరగడం వల్ల విమానయాన సంస్థలపై భారం పెరుగుతున్నది.

దీన్ని తగ్గించుకునేందుకు ఆయాన సంస్థలు టికెట్ల ధరకు అధనంగా ఇంధన ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణ దూరాన్ని బట్టి విమాన టికెట్‌ బేస్‌ ఛార్జీకి ఇంధన ఛార్జీని కలుపుతున్నట్లు అతి పెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. ఇదే బాటలో మిగిలిన సంస్థలు కూడా ఇంధన ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఉడాన్‌ సర్వీస్‌లకు మాత్రం ఇంధన ఛార్జీలు విధించడంలేదు.

- Advertisement -

ప్రతికూల ప్రభావంలేదు…

ప్రయాణికులపై ఇంధన ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నప్పటికీ విమానయాన సంస్థలపై దాని ప్రభావం పెద్దగా పడటంలేదు. పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తోంది. పండగల సీజన్‌, సెలవులు ఉండటం వల్ల విమాన ప్రయాణాలకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. సంక్రాంతి పండగ వరకు ఈ డిమాండ్‌ ఇలానే కొనసాగే అవకాశం ఉందని విమానయాన శాఖ అధికారులు అంచనా వేశారు.

దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగోపై ఇంధన ఛార్జీల పెంపుమూలంగా ప్రతికూల ప్రభావం పెద్దగా లేదని ఆ సంస్థకు చెందిన ఒకరు తెలిపారు. ఇంధన ఛార్జీలతో పాటు, ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో అన్ని సంస్థల టికెట్ల ధరలు పెరిగాయి. అయినప్పటికీ పెరిగిన టికెట్ల ధరల ప్రభావం విమానయాన సంస్థలపై పెద్దగా లేదు.

ఇండిగో వారానికి 13,535 సర్వీస్‌లు నడుపుతోంది. వీటిలో 24,0,374 సీట్లు అందుబాటులో ఉన్నాఇ. వీటిలో 501నుంచి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సర్వీసలు అత్యధికంగా 468 ఉన్నాయి. వీటిలో 7,42,456 సీట్లున్నాయి. 3501 కిలోమీటర్లు అంతకు మించి దూరం ప్రయాణించే సర్వీసులు 180 ఉన్నాయి. వీటిల్లో 40,150 సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఇండిగో సీట్ల భర్తీ 84.7 శాతంగా ఉంది.

వారానికి దాదాపు 20 లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి ఇంధన ఛార్జీల రూపంలో ఇండిగోకు వారానికి దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10 కోట్ల మంది ప్రయాణికులను చేరవేయాలని ఇండిగో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే ఇండిగో లాభదాయకత పెరుగుతుందని భావిస్తున్నారు.

దూరాన్ని భట్టి ఇంధన ఛార్జీ…

విమాన ప్రయాణం 500 కిలోమీటర్ల లోపుగా ఉంటే ఇంధన ఛార్జీ కింద 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. 501-1000 కిలోమీటర్ల దూరం ఉంటే ఇంధన ఛార్జీగా 400 రూపాయలు, 1001-1500 కిలోమీటర్ల దూరం ఉంటే 550 రూపాయలు, 1501-2500 కిలోమీటర్ల దూరం వరకు ఉంటే 650 రూపాయలు, 2501-3500 కిలోమీటర్ల వరకు దూరం ఉంటే ఇంధన ఛార్జీగా 800 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక 3501 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటే 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement