మన దేశ విదేశీ రుణాలు భారీగా పెరుగుతున్నాయి. జీడీపీలో అప్పుల శాతం అప్పటికే ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ సంవత్సరం మార్చితో పోల్చితే జూన్ నాటికి మన విదేశీ రుణాలు 4.7 బిలియన్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జూన్ చివరి నాటికి మన దేశ విదేశీ రుణాలు 629.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన కరెన్సీలో చూస్తే ఇది 52 లక్షల కోట్లకు పైగా ఉంది. విదేశీ రుణాలు మన జీడీపీలో జూన్ చివరి నాటికి 18.6 శాతంగా ఉందని ఆర్బీఐ తెలిపింది.
మార్చి చివరిన ఇది 18.8 శాతంగా ఉందని పేర్కొంది. విదేశీ రుణాలు పెరిగినప్పటికీ జీడీపీలో రుణాల శాతం తగ్గినట్లు పేర్కొంది.
మన దేశ విదేశీ రుణాల్లో అత్యధికంగా 54.4 శాతం వరకు డాలర్ రుణాలు ఉన్నాయి. మన రూపాయల్లో తీసుకున్న రుణాలు 30.4 శాతంగా ఉన్నాయి. ఎస్‌డీఆర్ 5.9 శాతం, యెన్ రూపంలో రుణాలు 5.7 శాతం, యూరో రూపంలో రుణాలు 3శాతంగా ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.
ఇటీవల కాలంలో యెన్‌తో పాటు ఇతర ప్రధానమైన కరెన్సీతో పోల్చితే డాలర్ విలువ పెరగడం వల్ల మన రుణాలు 3.1 బిలియన్ డాలర్లు పెరిగినట్లు తెలిపింది. డాలర్ వాల్యుయేషన్ ప్రభావాన్ని మినహాయిస్తే మన విదేశీ రుణాలు 2023 మార్చిలో 4.7 బిలియన్ డాలర్లు పెరిగితే, జూన్ నాటికి అవి 7.8 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న రుణాలు 505.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక సంవత్సరం లోపుగా చెల్లించాల్సిన రుణాలు 19.6 శాతం ఉన్నాయి. మార్చి 2023 నాటికి ఈ తరహా రుణాలు 20.6 శాతం ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. జూన్ చివిరి నాటికి ప్రభుత్వ రుణాలు తగ్గాయని, ప్రభుత్వేతర రుణాలు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. మన విదేశీ రుణాలు భారీగా ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.