హైదరాబాద్,ఆంధ్రప్రభ: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో మరో సాఫ్ట్‌వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని వీవీచాంబర్స్ నాలుగో అంతస్తులో సినార్జీ యూనివర్సల్ కంపెనీ ఉద్యోగాల పేరిట 500మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.3 లక్షల మేరకు వసూలు చేసినట్లు బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినార్జీ యూనివర్సల్ కంపెనీ యాజమాన్యం ఆదేశాల మేరకు సదరు కంపెనీ ప్రతినిధులు రూ.2 లక్షల తీసుకుని నిరుద్యోగులకు ఆఫర్ లెటర్ చేతికిచ్చి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి నమ్మించారు. ఆరు నెలలు గడిచినా వేతనాలు చెల్లించకపోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని ఉద్యోగులు ప్రశ్నించారు. కంపెనీకి ప్రాజెక్టులు లేవని ఉద్యోగులతో కంపెనీ యాజమాన్యం తెలిపింది.
గత కొద్ది రోజుల నుంచి కంపెనీ యాజమాన్యం ఆఫీస్‌కి రాకపోవడంతో మోసపోయామని ఉద్యోగులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సినార్జీ యూనివర్సల్ కంపెనీ చేసిన మోసం కోట్లలో ఉందని, ఈ కేసును ఆర్థిక నేర విభాగానికి బదిలీ చేస్తామని మాదాపూర్ పోలీసులు బాధితులకు తెలిపారు.