భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో కూడా ఈవీలపై అవగాహన పెరుగుతోంది.. ఫలితంగా నెలవారీ విక్రయాలు కూడా జోరందుకుంటున్నాయి. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కొత్త మాడల్స్ లో వాహనాలను విడుదల చేస్తున్నాయి. కాగా, భారత మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ వాహనం విడుదల అయింది.
RunR సంస్థ HS EV పేరిట కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు వాణిజ్య అవసరాలకు మాత్రమే వీటిని విక్రయించిన సంస్థ.. ఇక నుంచి ప్రజల రోజువారీ అవసరాలకు కోసం అందుబాటులో ఉంచనుంది. ఈ స్కూటర్లు వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ మొత్తం ఐదు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. రన్‌ఆర్ మొబిలిటీ (RunR Mobility) సంస్థ భారత్‌లోని ప్రధాన నగరాల్లో షోరూంలను తెరవాలని భావిస్తోంది.
దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి 40 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బంది లేకుండా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాక, ఈ స్కూటర్ బ్యాటరీని ఇచ్చి, పూర్తి ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందవచ్చని తెలుస్తోంది.
ఈ స్కూటర్లపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత డీలర్లను సంప్రదించి, టెస్ట్ రైడ్ చేయవచ్చని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ.1.25 లక్షల మరియు రూ.1.30 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉన్నాయి. ప్రస్తుతానికి HS EVలు భారత్‌లోనే అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు అక్టోబర్ 2023 చివరి నాటికి 200 HS EVలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది.