రిలయన్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అట్టహాసంగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు. శుక్రవారం రాత్రి ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత్ అంబానీ.. ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఈ వివాహ వేడుకకు రాజకీయ రంగానికి చెందిన పలువురితో పాటు క్రికెటర్లు, బాలీవుడ్ అగ్ర తారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా, కళారంగాల ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబసమేతంగా ఈ విహహ వేడుకకు హాజరయ్యారు. –
అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ కుటుంబం, ఏఆర్ రహమాన్ కుటుంబం, షారుఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, హృతిక్ రోషన్, మాధురి దీక్షిత్, కిమ్ కర్దాసియాన్, సూర్య జ్యోతిక జంట, రితేష్ జెనీలియా జంట, ప్రియాంక నిక్ జోనాస్ జోడి, నయనతార విఘ్నేష్ జంట, కేజీఎఫ్ స్టార్ యశ్, రణ్‌వీర్ దీపికా జంట, జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు.
క్రికెటర్లు ధోనీ, సచిన్, గంభీర్, బుమ్రా, బాబా రామ్‌దేవ్‌తోపాటు రామ్‌చరణ్ ఉపాసన దంపతులు వివాహంలో పాల్గొన్నారు. ఫేమస్ రెజ్లర్ జాన్ సీనకు ఘన స్వాగతం లభించింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో పాటు పలువురు రాజకీయ ఉద్దండులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఒకవైపు జోరువాన.. మరోవైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అతిథులతో ముంబై వీధులు నిండిపోయాయి.
అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ‘శుభ్ వివాహ్’తో మొదలైన ఈ గ్రాండ్ వెడ్డింగ్.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగియనున్నాయి. రేపటి రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. అనంత్-రాధికల నిశ్చితార్థం 2023 డిసెంబర్ 29 న జరగ్గా.. ఈ ఏడాది జనవరి 18 న మెహందీ నిర్వహించారు. మరుసటి రోజున వీరి ఎంగేజ్‌మెంట్ వైభవంగా చేపట్టారు. పెళ్లి వేడుకలో భాగంగా ముంబై సమీపంలోని పాల్‌గఢ్‌లో 50 జంటలకు పెళ్లిల్లు జరిపించి భారీగా కానుకలు అందించారు.