ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం జరిగే బిడ్డింగ్ నుంచి తప్పుకోవాలని అమెజాన్ నిర్ణయించింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సాధించడం ద్వారా మన దేశంలో మార్కెట్‌ను మరింత బలోపతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తొలుత అమెజాన్ నిర్ణయించింది. ఇప్పటికే ఇండియా మార్కెట్లో బలపడేందుకు 6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినందున , తిరిగి అదే లక్ష్యంతో 60 వేల కోట్ల ప్రసార హక్కుల కోసం పోటీ పడటంలో అర్థం లేదని కంపెనీ భావించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సారి జరిగే ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు పొందడానికి కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీని కోసం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్డ్ డిస్నీ, సోనీ గ్రూప్ పోటీపడుతున్నాయి. స్పోర్ట్స్ ను స్పాన్సర్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు తీవ్రంగా పోటీపడుతుంటాయి. ఇలా చేయడం ద్వారా మార్కెట్లో బలమైన ప్రభావం చూపించవచ్చని ఈ కంపెనీలు భావిస్తుంటాయి. యూరోపియన్ మార్కెట్లో ఫుట్‌బాల్ కు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు వేల కోట్ల డాలర్లను కంపెనీలు పెట్టుబడిగా పెడుతున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ఐపీఎల్ కూడా చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందు వల్లే ఈ సారి కంపెనీల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది.
ఐపీఎల్ కొన్ని వారాల పాటు జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్‌లను చూస్తుంటారు. మన దేశంతో పాటు, వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఐపీఎల్లో భాగస్వాములు అవుతుంటారు. ఇలాంటి క్రీడాకారులకు వారి మాతృదేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయా దేశాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వీక్షిస్తుంటారు. కంపెనీలకు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలను ఐపీఎల్ కల్పిస్తోంది. అందు వల్లే దీని ప్రసార హక్కుల కోసం ప్రతిఏటా పోటీ పెరుగుతోంది. ఐపీఎల్ విలువ 2020లో 590 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం దీని కంటే 25 శాతం అధికంగా ఉంటుందని డీ అండ్ పి సర్వీసెస్ సంస్థ అంచనా వేసింది. బీసీసీఐ మాత్రం ఐపీఎల్ విలువను 700 కోట్ల డాలర్లుగా అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.