Thursday, November 21, 2024

దేశీ మిర్చికి ఆల్ టైమ్‌ రికార్డు ధర.. 90 వేలు పలికిన దేశీ మిర్చి

వరంగల్‌, (ప్రభ న్యూస్‌) ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరు గడించిన వరంగల్‌ మార్కెట్‌లో దేశీ రకం మిర్చికి ఆల్ టైమ్‌ రికార్డు ధర పలికింది. వరంగల్‌ మార్కెట్లో దేశీ రకం మిర్చి ధర రోజు రోజుకి ఎగబాకుతున్నది. మార్కెట్‌ చరిత్రలోనే వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి రికార్డ్‌ స్థాయిలో ధర దక్కింది. క్వింటాల్‌ ధర రూ.90 వేలు పలికినట్లు మార్కెట్‌ అధికారులు ప్రకటించారు. మార్కెట్‌ చరిత్రలో దేశీ రకం మిర్చికి ఈ ధర ఆల్ టైం రికార్డ్‌. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లి గ్రామానికి చెందిన రైతు కంచ అశోక్‌ గురువారం ఒక బస్తా ద్వారా దేశీ రకం మిర్చిని ఎనుమాముల మార్కెట్‌ కు తీసుకురాగా ఖరీదుదార్లు క్వింటాల్‌ ధర రూ.90 వేలు చొప్పున కొనుగోలు చేశారు. చివరిసారి వరంగల్‌ మార్కెట్లో గత ఆగస్టు 30వ తేదీన దేశీ రకం మిర్చి ధర క్వింటాల్‌ రూ.65 వేలు పలికింది. దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన రైతు రవి 26 బస్తాల దేశీ రకం మిర్చిని ఎనుమాముల మార్కెట్‌ కు తీసుకురాగా ఈ ధర పలికింది.

గత ఏప్రిల్‌లో ఇదే రకం మిర్చికి మార్కెట్‌ కు తెచ్చిన రైతు క్వింటాల్‌ ధర రూ.55,551 పొందాడు. కోల్డ్‌ స్టోరేజీ లో నిల్వచేసిన రైతుల్లో కొందరు ఇప్పుడు అమ్మేందుకు దేశీ రకం మిర్చిని ఎనుమాముల మార్కెట్‌ కు తీసుకొస్తున్నట్లు తెలిసింది. దేశీ రకం మిర్చికి ఇటీవల పలికిన క్వింటాల్‌ ధర రూ. 65 వేల గరిష్ట ధర కాస్తా గురు వారం మార్కెట్‌ రేటు రూ.90 వేలు పలికి రికార్డు బ్రేక్‌ చేయడం విశేషం. దేశీ రకం మిర్చికి మార్కెట్‌ లో పలుకుతున్న ధరలను చూసి వ్యాపారులు, అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement