ప్రముఖ టెలికం కంపనీ భారతీ ఎయిర్‌టెల్ 4వ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. సంస్థ ఆదాయం 14.3 శాతం పెరిగి మార్చి 30తో ముగిసిన త్రైమాసికంలో 36,009 కోట్లుగా నమోదైంది. 2021-22 ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం 31,500 కోట్లుగా ఉంది. ఎయిర్‌టెల్ ఇండియా బిజినెస్ నుంచి ఈ త్రైమాసికంలో ఆదాయం 12.2 శాతం పెరిగి, 25,250 కోట్లుగా ఉంది. 4వ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం 49.2 శాతం పెరిగి 3,005.6 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ 2,007.8 కోట్ల నికర లాభాం సాధించింది. సగటున ఒక యూజర్ నుంచి వస్తున్న ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ త్రైమాసికంలో 193 రూపాయలుగా ఉంది.
ఇది క్రితం తైమాసికంలోనూ ఇదే స్థాయిలో ఉంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే మాత్రం 8.4 శాతం పెరిగింది. ఎయిర్‌టెల్‌కు ప్రధాన పోటీదారుగా రిలయన్స్ జియో 4వ త్రైమాసికంలో ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 178.8 రూపాయలుగా ఉన్నట్లు వెల్లడించింది. అంతకు ముందు త్రైమాసికం కంటే 0.3 శాతం పెరిగిందని తెలిపింది. 4వ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కొత్తగా 7.4 మిలియన్ల మంది 4జీ కస్టమర్లు వచ్చారు. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితో కొత్త కస్టమర్ల విషయంలో 3.4 శాతం పెరుగుదల ఉంది. 5 రూపాయల ముఖ విలువ ఉన్న కంపెనీ షేరు ఒక్కటికి 4 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.