ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ ఎయిర్‌లైన్‌ను ఫ్లాగ్‌షిప్ కంపెనీగా మలిచేందుకు అవసరమైన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎయిర్ ఇండియా పునరుద్ధరణ కోసం రూ.15,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు బ్యాంకులతో టాటా గ్రూప్ సంప్రదింపులు జరుపుతోంది. ఎయిర్ ఇండియాను ప్రతిష్టాత్మక సంస్ధగా తీర్చిదిద్దుతామని గతంలో టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ చేసిన ప్రకటనను సాకారం చేసే దిశగా కార్యాచరణకు కంపెనీ కసరత్తు సాగిస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ రుణాల ద్వారా ఎయిర్ ఇండియా రోజువారీ ఆపరేషన్స్‌ను చేపడుతూ నష్టాలను భర్తీ చేసుకునేందుకు టాటా గ్రూప్ యోచిస్తోంది. విమాన అద్దెలు, విమానాల సంఖ్య పెంపు, ఐటీ కార్యకలాపాల ప్రక్షాళనకూ ఈ నిధులను వెచ్చించాలని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఎయిర్ ఇండియా బిడ్‌లో గెలుపొందిన అనంతరం టెలేస్ రూ 23,000 కోట్ల అన్‌సెక్యూర్డ్ రుణాన్ని ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల నుంచి 4.25 శాతం వడ్డీపై సమీకరించింది.
మార్చి 2021 నాటికి టాటా సొంతమైన ఎయిర్ ఇండియా సంచిత నష్టాలు రూ 83,916 కోట్లకు చేరగా, 2022 ఆర్ధిక సంవత్సరంలో మరో రూ 9556 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎయిర్‌లైన్‌ను ప్రక్షాళన చేసేందుకు టాటా గ్రూప్ పలు చర్యలు చేపడుతోంది. పేలవంగా ఉన్న కస్టమర్ సర్వీసును మెరుగుపరచడం నుంచి విమానాల సంఖ్యను పెంచడం వరకూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేండ్లలో 113 విమానాల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచాలని నిర్ణయించింది.