ఎయిరిండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విమాన సంస్థల విలీన అంశంపై సింగపూర్ ఎయిర్‌లైన్స్ టాటాగ్రూప్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తాజాగా ధ్రువీకరించింది. భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ఎయిరిండియాతోపాటు, విస్తారాలోనూ టాటా గ్రూపునకు 51శాతం వాటా ఉంది. మిగిలిన వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. విస్తారాను విలీనం చేసుకోవాలని టాటాలు ప్రయత్నాలు ప్రారంభించారు.
రెండు కంపెనీల విలీనంపై టాటాలతో చర్చలు జరుపుతున్నామని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజీకి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇప్పటి వరకు ఇరు సంస్థల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపింది.