విద్యార్ధులకు ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు బుధవారం నాడు తెలిపింది. విద్యార్ధులకు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో పాటు, అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్లు వస్తాయి. వీటితో పాటు ప్రయాణ తేదీని ఒక సారి ఉచితంగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రత్యేక ఛార్జీలు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్యాబిన్స్ అందుబాటులో ఉంటాయి. భారత్‌లోని 49 నరాలకు, విదేశాల్లో 42 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా సర్వీస్‌లు నడిపిస్తోంది.
అంతర్జాతీయ రూట్లలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించే విద్యార్ధులు కూడా ఈ ఆఫర్లను పొందవచ్చని తెలిపింది. ఎయిర్ ఇండియా మొబైల్ యాప్‌పై టికెట్లు బుక్ చేసుకునేన వారికి ఇప్పటికే ఎలాంటి బుకింగ్ ఛార్జీలు వసూలు చేయడంలేదు. దీని వల్ల దేశీయ రూట్లలో 399 రూపాయలు, ఇంటర్నేషనల్ రూట్లలో 999 రూపాయలను ఆదా చేసుకోవచ్చు.
ఎయిర్ ఇండియా భాగస్వామ్యంతో జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా మరింత రాయితీ పొందవచ్చు. మహారాజా క్లబ్‌లో నమోదు చేసుకోవడం ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్లు పొందడానికి 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు విద్యార్ధులు అర్హులు.