రానున్న రోజుల్లో మరిన్ని బ్రాండ్లను సొంతం చేసుకునే దిశగా అదానీ విల్మార్ అడుగులు వేస్తోంది. తద్వారా వంటనూనెల విక్రయాల్లో అగ్రగామిగా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు సంస్త సీఈవో, ఎండీ ఆగ్శూ మల్లిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే, ఫార్చూన్, కోహినూర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నామని, వచ్చే మార్చిలోగా మరికొన్ని కొనుగోళ్ల ఒప్పందాలు పూర్తవుతాయని చెప్పారు. అదానీ విల్మర్ కూడా రిటైల్‌రంగంలో విస్తరణకు వేగంగా ముందుకు వెళ్తుందని ఆయన సంకేతమిచ్చారు. ఈఏడాది ఫిబ్రవరిలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సందర్భంగా సమీకరించిన నిధుల్లో దాదాపు రూ.500కోట్లను వేర్వేరు బ్రాండ్ల కొనుగోళ్లకోసం కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంకా అదనపు నిధులు అవసరమైతే కంపెనీ ఆదాయం నుంచి తీసుకోవడం జరుగుతుందని మల్లిక్ వివరించారు. ఇష్యూధర రూ.230తో పోల్చితే విల్మార్ ధర ఇప్పటికే దాదాపు 200 శాతం వృద్ధిచెందింది. గతేడాది కాలంలో అదానీ గ్రూపు అనేక ఇతర రంగాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది. ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, గనులు, గ్రీన్‌ఎనర్జీ, రక్షణ రంగాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎఫ్‌ఎంసీజీలో పోటాపోటీ..
భారతీయ కన్సూమర్ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయ వాతావరణం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐరాస నివేదిక ప్రకారం ఇండియా ఆహార ఉత్పత్తి పరిశ్రమ విలువ రమారమి రూ.31.8 లక్షల కోట్లు. ఈ రంగంలో వేళ్లూనుకునేందుకు భారతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికో గోద్రెజ్, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పార్లే, బ్రిటానియా వంటి సంస్థలు నిలదొక్కుకున్నప్పటికీ, కొత్తగా దిగ్గజ సంస్థలైన రిలయన్స్, అదానీ ఈ రంగంలో పోటీకి సిద్ధమయ్యాయి. వీలైనన్ని ఎక్కువ బ్రాండ్లతో మార్కెట్లో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.