Tuesday, November 26, 2024

సిమెంట్‌ ఉత్పత్తిని రెట్టింపు చేస్తామన్న అదానీ

తమ గ్రూప్‌ సంస్థల సిమెంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ గ్రూప్‌ అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ సిమెంట్స్‌ కంపెనీలను ఇటీవలే కొనుగోలు చేసింది. దీనితో తమ సిమెంట్‌ కంపెనీలు దేశంలోనే అత్యంత లాభదాయక కంపెనీగా అవతరించనుందని సంస్థ అధినేత గౌతమ్‌ అదానీ వెల్లడించారు. శనివారం నాడు అదానీ సంస్థ ఉద్యోగుల నుంచి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని కంపెనీ సోమవారం నాడు అదానీ ప్రసంగాన్ని విడుదల చేసింది.
స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్స్‌ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కంపెనీలను 52,000 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ రెండు కంపెనీల కొనుగోలుతో ప్రస్తుతం దేశంలో సిమెంట్‌ ఉత్పత్తిలో తాము రెండో స్థానానికి చేరామని అదానీ చెప్పారు. ఈ కొనుగోలు ప్రక్రియను కేవలం 4 నెలల్లోనే ముగించడం ఒక రికార్డ్‌ అని ఆయన చెప్పారు. భారత్‌ వృద్ధి గణనీయంగా పెరుగుతున్న సమయంలో తాము సిమెంట్‌ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించడం కలిసి వస్తుందని అదానీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నందున సిమెంట్‌కు భారీ గిరాకీ ఉంటుందని చెప్పారు.

తలసరి వినియోగం తక్కువ
తాము సిమెంట్‌ తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు కారణాన్ని కూడా ఆయన వివరించారు. మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, తలసరి వినియోగంలో మాత్రం వెనుకబడి ఉన్నామని చెప్పారు. మన దేశంలో తలసరి సిమెంట్‌ వినియోగం 250 కిలోలు మాత్రమే ఉందని, చైనాలో ఇది 1600 కిలోలుగా ఉందని గౌతమ్‌ అదానీ చెప్పారు. ఈ వ్యాపారంలో ఏడు రేట్లకు పైగా వృద్ధి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల సామర్ధ్యాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో 140 మిలియన్‌ టన్నులకు పెంచుతామని ఆయన ప్రకటించారు.

పెరగనున్న డిమాండ్‌
ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల వల్ల రానున్న కాలంలో సిమెంట్‌ డిమాండ్‌ జీడీపీలో 1.2 నుంచి 1.5 రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.దేశంలో మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాల్లో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయని , దీని వల్ల సిమెంట్‌ డిమాం డ్‌ భారీగా పెరుగుతుందన్నారు. అదానీలో గ్రూప్‌లో మౌలికసదుపాయల రంగంతో పాటు, పోర్టులు, లాజిస్టిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ బిజినెస్‌, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

టాప్‌లో గ్రూప్‌ కంపెనీలు
అదానీ గ్రూప్‌లో గ్రీన్‌ ఎనర్జీ బిజినెస్‌ ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్‌ కంపెనీగా అవతరించనుందని, ఇందులో 70 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. గ్రీన్‌ హైడ్రోజన్‌లోనూ ఈ పెట్టుబడులు ఉంటాయన్నారు. అదానీ గ్రూప్‌ ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌పోర్టు ఆపరేటర్‌గా ఉంది. మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో అదానీ గ్రూప్‌ ఎయిర్‌పోర్టుల ద్వారా 25 శాతం మంది ప్రయాణీస్తున్నారు. ఎయిర్‌ కార్గోలో అదానీ గ్రూప్‌ 40 శాతం వాటా కలిగి ఉంది. ఇక పోర్టుల్లోనూ అదానీ గ్రూప్‌ కంపెనీ అతి పెద్దదిగా ఉంది. ఈ రంగంలో కంపెనీ 30 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.

అదానీ గ్రూప్‌ కంపెనీ దేశంలోనే ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ కంపెనీగా ఉందని అదానీ చెప్పారు. తాము విద్యుత్‌ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌, పంపిణీ రంగాల్లో ఉన్నామని చెప్పారు. దీంతో పాటు ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ గ్యాస్‌, సిటీ గ్యాస్‌, పైపుడ్‌ గ్యాస్‌ పంపిణీలో దేశంలోనే అగ్రగామి సం స్థగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇక రహదారుల రంగంలోనూ అదానీ గ్రూప్‌ సంస్థ త్వరలోనే అగ్రస్థానికి చేరుకుంటుందని చెప్పారు. సంస్థ కొన్ని అతి పెద్ద రోడ్‌ కాంట్రాక్ట్‌లు పొందిందని తెలిపారు. అదానీ విల్మర్‌ కంపెనీ ఐపీఓ తో దేశంలోనే అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా అవతరించిందని చెప్పారు.

విభిన్న రంగాల్లోకి విస్తరణ
విభిన్న రంగాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. డేటా సెంటర్స్‌, సూపర్‌ యాప్స్‌, ఎయిర్‌స్పేస్‌, డిఫెన్స్‌, ఇండస్ట్రీయల్‌ క్లౌడ్స్‌, మెటిరియల్స్‌, పెట్రోకెమికల్స్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నామని అదానీ చెప్పారు. అదానీ గ్రూప్‌ గతం కంటే ఆర్థికంగా బలంగా ఉందని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను సమీకరిస్తున్నామని, గ్రూప్‌ మరింత విస్తరించేందుకు, బలపడేందుకు వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 260 బిలియన్‌ డాలర్లుగా ఉందని, దేశంలో ఇంత వేగంగా మరే సంస్థ, కంపెనీ వృద్ధి చెందలేదని, ఇక ముందు కూడా వృద్ధిలో తామే ముందుంటామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement