Friday, November 22, 2024

3వ స్థానానికి అదానీ, టాప్‌ 10లోలేని అంబానీ.. స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో మారిన స్థానాలు

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయారు. తాజాగా బ్లూమ్‌బర్గ్‌ ప్రకటించిన జాబితా ప్రకారం గౌతమ్‌ అదానీ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కంటే వెనుకబడ్డారు. సోమవారంనాడు దేశీయ స్థాక్‌మార్కెట్‌ భారీ నష్టాల్లో ముగియడంతో అదానీ లిస్టెడ్‌ కంపెనీల విలువ తగ్గింది. దీంతో ఆయన రెండో స్థానాన్ని కోల్పోయారు. కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌, మూడో స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ టాప్‌ 10లో స్థానం కోల్పోయారు. సోమవారం నాడు స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో అదానీ 6.91 బిలియన్‌ డాలర్లు నష్టపోవడంతో ఆయన సంపద 135 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

దే సమయంలో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద 138 బిలియన్‌ డాలర్లు ఉందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. గతంలో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరిన మొదటి ఆసియన్‌, ఇండియన్‌గా గౌతమ్‌ అదానీ రికార్డ్‌ సృష్టించారు. ఈ ఒక్క సంవత్సరంలోనే అదానీ సంపద 58.5 బిలియన్‌ డాలర్లు పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి స్టాక్‌ నష్టాలతో కుబేరుల జాబితాలో 11వ స్థానానికి పరమితం అయ్యారు. ఆయన సంపద 82.4 బిలియన్లకు తగ్గిపోయింది. ఇదే సమయంలో ఎలాన్‌ మస్క్‌ సంపద 25.1 బిలియన్‌ డాలర్లు, జెఫ్‌ బెజోస్‌ సంపద 54.3 బిలియన్‌ డాలర్లు తగ్గిపోయింది. బ్లూమ్‌బర్గ్‌ ప్రకటించిన బిలియనీర్ల జాబితాలో ఉన్న 14 మందిలో ఒక్క అదానీ సంపద మాత్రమే ఈ సంవత్సరం సపంద పెంచుకున్నారు. జాబితాలోని మిగిలిన బిలియనీర్లు అందరూ భారీగా సంపద నష్టపోయారు.

గత వారం సంపద విషయంలో అదానీ రోజుకు 1612 కోట్ల సాంపదనతో అంబానీని మించిపోయారని ఐఐఎఫ్‌ఎల్‌ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. ప్రస్తుతం అంబానీ కంటే అదానీ సంపద 3 లక్షల కోట్లు ఎక్కువ. అదానీ మొత్తం సంపద ప్రస్తుతం 10,94,400 కోట్లుగా ఉంది. అంబానీ నికర సంపద 7.94 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లోని 7 కంపెనీల ఒక్కొక్క దాని మార్కెట్‌ విలువ లక్ష కోట్లకు పైగా ఉంది. దీని వల్లే అదానీ దేశంలోనే అత్యంత ధనికుడిగా అగ్రస్థానంలోనూ, ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడానికి దోహదం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement