Friday, November 22, 2024

ప్రపంచ సంపన్నుల్లో అదానీ నెంబర్‌ 5, వారెన్‌ బఫెట్‌ స్థానం కైవసం..

భారత్‌ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్‌ టైమ్‌ బిలియనీర్ల తాజా జాబితా ప్రకారం.. అదానీ ఇప్పుడు ప్రపంచంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. అదానీ ఆస్తుల నికర విలువ 123.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ 8వ స్థానంలో నిలిచారు. ఈ విధంగా చూస్తే.. ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని మొత్తం నికర ఆస్తుల విలువ 269.70 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జెఫ్‌ బెజోస్‌ 170.2 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ అతని కుటుంబం నికర ఆస్తుల విలువ 166.8 బిలియన్‌ డాలర్లుగా ఉండటంతో.. మూడో స్థానంలో నిలిచాడు..

భారీగా పెరిగిన అదానీ ఆస్తులు..

అదానీ పవర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1లక్ష కోట్లను దాటింది. దీంతో లక్ష కోట్లు దాటిన ఆరో కంపెనీగా అదానీ గ్రూప్‌లో నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.270.80 వద్ద ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ స్టాక్‌ 165శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసుకుంది. కేవలం ఈ నెలలో అదానీ పవర్‌ స్టాక్‌ 46 శాం పెరిగింది. దీనికి ముందు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ రూ.1లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని సాధించాయి. పోర్టులు, విమానాశ్రయాల నిర్వహణ వంటి వ్యాపారాలతో పాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ అదానీ రాణిస్తున్నారు. ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు, ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవ్వగా.. అదానీ వ్యాపారాలు మాత్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దీంతో ఒక్క 2022లోనే ఆయన సంపద 43 బిలియన్‌ డాలర్లు పెరిగింది. మొత్తంగా ఆయన సంపద ఈ ఏడాదిలో 56 శాతం పెరిగింది.

ప్రపంచంలోనే టాప్‌-10 సంపన్నులు..

  1. ఎలాన్‌ మస్క్‌ 269.70 బిలియన్‌ డాలర్లు
  2. జెఫ్‌ బెజోస్‌ 170.20 బిలియన్‌ డాలర్లు
  3. బెర్నాల్డ్‌ ఆర్నాల్డ్‌ 166.80 బిలియన్‌ డాలర్లు
  4. బిల్‌గేట్స్‌ 130.20 బిలియన్‌ డాలర్లు
  5. గౌతమ్‌ అదానీ 123.20 బిలియన్‌ డాలర్లు
  6. వారెన్‌ బఫెట్‌ 121.70 బిలియన్‌ డాలర్లు
  7. లారీ ఎల్లిసన్‌ 107.60 బిలియన్‌ డాలర్లు
  8. ముఖేష్‌ అంబానీ 103.70 బిలియన్‌ డాలర్లు
  9. లారీ పేజీ 102.40 బిలియన్‌ డాలర్లు
  10. సెర్గీ బ్రిన్‌ 98.50 బిలియన్‌ డాలర్లు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement