ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలోకి రాకేట్ వేగంతో దూసుకు వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం వరకు ఆయన మన దేశంలో మాత్రమే కొద్దిగా పరిచయం ఉన్న పేరు. పెద్దగా చదువుకోలేదు. కమొడిటీ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించిన గౌతమ్ అదానీ నేడు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ రూపొందించిన కుబేరుల జాబితాలో తొలి మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. అనేక సంవత్సరాల పాటు ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా కూడా ఈ ఘనత సాధించలేకపోయారు.
సోమవారం నాటికి గౌతమ్ అదానీ సంపద 137.4 బిలియన్ డాలర్లు, మన కరెన్సీలో దాదాపు 10.93 లక్షల కోట్లుకు చేరుకుంది. బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను వెనక్కి నెట్టిన ఆయన మూడో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ అధినే జెఫ్ బెజోస్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. కోవిడ్ కాలంలోనూ, తరువాత కాలంలో ప్రపంచ కుబేరుల సంపద తగ్గితే , అదానీ సంపద మాత్రం రాకెట్ వేగంతో పెరిగింది. ఒక్క 2022లోనే ఆయన సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ ఆసియా కుబేరుడిగా నిలిచారు. ఏప్రిల్‌లో ఆయన సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. గత నెలలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ దాటేసిన ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానానికి చేరుకున్నారు. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ తమ సంపదలో ఎక్కువ భాగం దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వడంతో వారిని అదానీ అధిగమించారు.
గత రెండు సంవత్సరాల్లో అదానీ గ్రూప్ విమానాశ్రయాలు, గనులు, స్వచ్ఛ ఇంధనం, పునరుత్పాదక విద్యుత్, డేటా కేంద్రాలు, రక్షణ సంబంధించిన వ్యాపారాలు ఇలా అనేక రంగాల్లోకి అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సిమెంట్ రంగంలో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. మీడియా రంగంలోని ఎన్‌డీటీవీని త్వరలోనే కొనుగోలు చేయనున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూప్ 30కి పైగా సంస్థలు, కంపెనలను కొనుగోలు చేసింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 91.9 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానం లో ఉన్నారు.
ఎలాన్ మస్క్ 251 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. 153 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో, 137 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ మూడో స్థానంలో, 136 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ నాలుగో స్థానంలో, 117 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ 5వ స్థానంలో, 100 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ 6వ స్థానంలో, 100 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ 7వ స్థానంలో, 95.8 బిలియన్ డాలర్లతో సెర్గీబ్రిన్ 8వ స్థానంలో, 93.7బిలియన్ డాలర్లలొ స్టీవ్ బామర్ 9వ స్థానంలో, 93.3 బిలియన్ డాలర్లతో లారీ ఎలిసన్ 10వ స్థానంలో, 91.9 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.