ప్రముక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ టెలికం రంగంలోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనాలని అదానీ గ్రూప్ నిర్ణయించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ అధ్వర్యంలోని ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు పోటీగా అదానీ కూడా రంగంలోకి రానున్నారని వచ్చిన వార్తలు కంపెనీ ప్రతినిధి తోసిపుచ్చారు. తాము 5జీ వేలంలో పాల్గొనేది టెలికం సర్వీస్‌ల్లోకి రావడానికి కాదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. కొనుగోలు చేసే స్పెక్ట్రమ్‌ను కంపెనీ అవసరాలకు ఉపయోగించుకుంటామని ఆ ప్రకటనలో తెలిపింది. తమకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయిస్తే ఎయిర్ పోర్టులు, పోర్టులు, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, తయారీ రంగంలో కార్యకలాపాల్లో సైబర్ సెక్యూరిటీ కోసం మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు. రానున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనే కంపెనీలు జులై 12లోగా యాజమాన్య దృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆదారంగా బిడ్డర్ ఒనర్‌షిప్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఇలా సర్టిఫికెట్ ఉన్న సంస్థలు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. జులై 19 లోగా కంపెనీలు తమ ధరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. 20వ తేదీన పోటీలో ఉన్న బిడ్డర్ల పేర్లను ప్రకటిస్తారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
అదానీ గ్రూప్ టెలికం సర్వీసుల రంగంలోకి బదులు భారీ ఎత్తున డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అదానీ కంపెనీ ఇప్పటికే ఎడ్జ్‌కానెక్స్ అనే అంతర్జాతీయ సంస్థలో ఈ విషయంలో ఒప్పందం చేసుకుందని, ఈ రెండు కంపెనీలు సమాన భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తాయని చెబుతున్నారు. ఈ జాయింట్ వెంచర్ చెన్నయ్, నావీ ముంబాయి, నోయిడా, వైజాగ్, హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుందని వార్తలు వచ్చాయి. దీని పై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. డేటా బిజినెస్‌లోనూ అదానీ కంపెనీ ఇండియన్ టెలికం కంపెనీలతో పాటు, అంతర్జాతీయ కంపెనీలైన అమేజాన్ , గూగుల్ వంటి సంస్థలతో పోటీ పడాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.