Monday, November 25, 2024

Adani | హిండెన్‌బర్గ్‌ దెబ్బ నుంచి కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ 2022 జనవరిలో విడుదల చేసిన నివేదిక దేశంలో పెద్ద దుమారమే లేపింది. అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలతో ఆ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. ఒక దశలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 4వేల మార్క్‌ను కూడా అదిగమించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత 52 వారాల కనిష్టానికి పడిపోయింది.

ఈ నివేదిక తరువాత అదానీ గ్రూప్‌ అనేక నివారణ చర్యలు తీసుకుంది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ క్రమంగా కోలుకుంటూ వస్తున్నాయి. శుక్రవారంనాడు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు రాణించడంతో ఇంట్రాడేలో రూ.3,449 వద్ద హిండెన్‌బర్గ్‌ నివేదికకు పూర్వం ఉన్న స్థితిని అందుకుంది.

అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ 2022 జనవరిలో వెల్లడించిన నివేదికలో అదానీ గ్రూప్‌ కంపెనీలు చాలా సంవత్సరాలుగా స్టాక్‌ అవకతవకలకు పాల్పడుతున్నాయని, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. షెల్‌ కంపెనీలు పెట్టి మనీలాండరింగ్‌కు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ ఆరోపణలు స్టాక్‌ మార్కెట్లపైనా ప్రభావం చూపించాయి. రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.

20వేల కోట్ల ఫాలోఆన్‌ ఐపీఓను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాయిదా వేసుకుంది. గత సంవత్సరం ఫిబ్రవరి3న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర 1,07.45 వద్ద కనిష్టానికి చేరింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. కోర్టు దీనిపై నిపుణుల కమిటీ నియమించింది. సెబీని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అదానీ గ్రూప్‌ షేర్లలో అనుమానిత లావాదేవీలు ఏమీ లభించలేదని నిపుణుల కమిటీ తెలిపింది.

సెబీ కూడా కోర్టుకు నివేదిక సమర్పించింది. మరో రెండు అంశాలపై విచారణ పూర్తి కావాల్సి ఉందని పేర్కొంది. తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వేగంగా కోలుకున్నాయి. అమెరికా బ్రోకరేజీ సంస్థల మద్దతు, జీక్యూజీ భారీ పెట్టుబడి పెట్టడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కోలుకుంది. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరెప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌, అమెరికాకు చెందిన ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేసినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

- Advertisement -

బీఎస్‌ఈ ఇండెక్స్‌లో విప్రో స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ చేరవచ్చన్న వార్తలు రావడంతో గురు, శుక్రవారాల్లో ఈ షేరు మరింత బలపడింది. 16 నెలలుగా చూస్తే ఈ షేరు మూడు రెట్లు పెరిగింది. అదానీ లిస్టెడ్‌ కంపెనీల షేర్లు అన్నీ కూడా హిండెన్‌బర్గ్‌ దెబ్బ నుంచి దాదాపు కోలుకున్నాయి. గడిచిన నెలలోరోజుల్లోనే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర 12 శాతం పెరిగింది. శుక్రవారం నాటికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మార్కెట్‌ విలువ 3,92,473.89 కోట్లుగా ఉంది.

హిండెన్‌బర్గ్‌తో గౌతమ్‌ అదానీ సంపద 150 బిలియన్‌ డాలర్ల నుంచి 2023 ఫిబ్రవరి 27 నాటికి 37.7 బిలియన్‌ డాలర్లకు
పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న ఆయన ఒక్క సారిగా 27వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన 109 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలోకి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement