Monday, November 18, 2024

ఏసీలు, కూల‌ర్లు ఆన్.. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : జూన్‌ 20 నుంచి ఆగస్టు 15 వరకు హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. అయినా భూతాపం చల్లారలేదు. వర్షం కురిసినప్పుడే చల్లగాలులు వీచాయి. దీంతో ఆయా రోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోయింది. తిరిగి పది, పది హేను రోజులుగావర్షాలు తెరిపినివ్వడమే కాకుండా ఎండలు వస్తుండడంతో తిరిగి విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. వర్షాలు పడిన సమయంలో43 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ వినియోగం తిరిగి 61 మిలియన్‌ యూనిట్లకు చేరువైంది. అప్పుడప్పుడు చిరు జల్లులు కురుస్తున్న మధ్యాహ్నం సమయంలో ఎండల తాకిడికి పెరుగుతున్న ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు జోరుగా పని చేస్తున్నాయి.

దీనితో పగటి పూట విద్యుత్‌ డిమాండ్‌ అధికమైంది. ఆగస్టు నెలలో గతంలో ఎప్పుడు లేనంత విద్యుత్‌ వినియోగం జరుగుతుందని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు. జూలైలో 43 నుంచి 44 మిలియన్‌ యూనిట్లు ఉన్న విద్యుత్‌ వినియోగం ఆగస్టు మొదటి రెండు వారాల పాటు సరాసరిగా విద్యుత్‌ వినియోగం 47మిలియన్‌ యూనిట్లుగా నమోదు అయింది. విద్యుత్‌ డిమాండ్‌ కూడా ఏ రోజున 2400 మెగావాట్లు దాటలేదు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కేవలం పది పదిహేను రోజుల వ్యవధిలో విద్యుత్‌ వినియోగం 13 నుంచి 14 మిలియన్‌ యూనిట్లు పెరిగింది. విద్యుత్‌ డిమాండ్‌ కూడా 500 మెగావాట్లకుపైగా పెరగడం జరిగింది.

ఇందులో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కవగా పగలు (మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిమాండ్‌ పెరుగుతుంది) ఎక్కువగా నమోదు అవుతుంది. శుక్ర, శనివారాలలో రాత్రి విద్యుత్‌ డిమాండ్‌ 2900 మెగావాట్లు ఉంటే పగలు 2916 మెగావాట్లుగా నమోదు అయింది. గతంలో హైదరాబాద్‌ నగరంలో విద్యుత్‌ డిమాండ్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నగర వ్యాప్తంగా విద్యుత్‌ దీపాలు వెలిగించడమే కారణం. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement