Friday, November 22, 2024

వేగంగా విస్తరిస్తున్న లగ్జరీ కార్ల మార్కెట్‌

దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. భారతీయులు లగ్జరీ కార్లవైపు మక్కువ చూపుతున్నారు. ఇటీవల ముగిసిన దసరావళి ఫెస్టివల్‌ సీజన్‌ విక్రయాల్లో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా, ఆడి ఇండియా తదితర సంస్థలు రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదు చేశాయి. ఏడాది చివరి నాటికి మెరుగైన రికార్డు నమోదవుతుందని అంచనా వేస్తున్నామని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అయ్యర్‌ చెప్పారు.

ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న పలు కొత్త మోడల్‌ కార్లతోపాటు కస్టమర్ల సెంటిమెంట్‌ కూడా బలంగా ఉందన్నారు. జీఎల్సీ వంటి ఎస్‌యూవీ కార్ల తయారీలో సప్లయ్‌ చైన్‌ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య లగ్జరీ కార్ల విక్రయాల్లో 88 శాతం వృద్ధి నమోదైందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. తొమ్మిది నెలల్లో 5,530 యూనిట్ల కార్లు విక్రయించినట్లు తెలిపారు.

ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌ బ్యాక్‌, క్యూ5, ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ వంటి మోడల్‌ కార్లు బెస్ట్‌ మోడల్‌ కార్లుగా నిలిచాయని చెప్పారు. హైదరాబాద్‌ మొదలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో తమ కార్లకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. గతేడాది 71 రోజుల పండుగల సీజన్‌లో మొత్తం 8.10 లక్షల కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి నవంబర్‌ 14 మధ్య రిటైల్‌ కార్ల విక్రయాలు పది లక్షల మార్క్‌ను దాటేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement