దేశ టెలికం రంగంలో కొత్త శకం ప్రారంభమైంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 5జీ సర్వీస్‌లు శనివారం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఢిల్లి ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి, అక్కడే 5జీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో 5జీ సేవల సామర్ధ్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. రిలయన్స్ జియో పెవిలియన్‌లో ప్రధాన మంత్రికి సంస్థ ఛైర్మన్ అకాశ్ అంబానీ 5జీ సేవల గురించి వివరించారు. 5జీ సేవల సామర్ధ్యాన్ని మోడీ స్వయంగా పరిశీలించారు. ఆయన తొలి 5జీ కాల్‌ను మాట్లాడారు.
కొత్త శకం ప్రారంభం..
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ 5జీ ప్రారంభంతో దేశంలో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయులకు టెలికం రంగం ఇస్తున్న బహుమతి ఇది అన్నారు. డిజిటల్ ఇండియా అనే నాలుగు స్తంభాలపై
ఉంటుందని మోడీ చెప్పారు. డివైజ్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా కాస్ట్, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌గా వాటిని పేర్కొన్నారు.
2014లో దేశం నుంచి ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఎగుమతి కాలేదని , ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ఎగుమతి చేయకలిగే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. ఇప్పుడు దేశంలో తక్కువ ధరలోనే అనేక ఫీచర్లు ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
తగ్గిన డేటా రేట్లు
ఒకప్పుడు 1జీబీ డేటా 300 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం అది 10 రూపాయలకే వస్తుందని ప్రధాని చెప్పారు. దేశంలో సగటున నెలకు 14 జీబీని ప్రజలు ఉపయోగిస్తున్నారని, ఈ లెక్కన నెలకు 4200 అయ్యే ఖర్చు ప్రస్తుతం 125-150 రూపాయలు మాత్రమే అవుతుందన్నారు. ప్రభుత్వం చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. డిజిటల్ టెక్నాలజీ వల్ల చిన్న వ్యాపారి కూడా యూపీఐ సేవలు వినియోగించుకుంటున్నారని ప్రధాని చెప్పారు. టెక్నాలజీ, టెలికం రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి ద్వారా పారిశ్రామిక విప్లవం 4.0కు భారత్ నాయకత్వం వహిస్తుందన్నారు. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ పరిశ్రమలే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200కు చేరిందని మోడీ తెలిపారు. 5జీ టెక్నాలజీ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి, ఉత్పాదక పెరగడానికి, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. 5జీ విస్తరిస్తే దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న సాంకేతిక, ఆర్థిక అంతరాలను గణనీయంగా తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. 5జీ సేవలు ప్రారంభం డిజిటల్ ఇండియాలో భాగంగా టెక్నాలజీని ప్రజల చెంతకు చేరుస్తుందన్నారు.
పెరిగిన ఇంటర్నెట్ వినియోగం
2014కు ముందు 60 మిలియన్ల మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 8 బిలియన్లకు పెరిగిందన్నారు. 2014కు ముందు ఇంటర్నెట్ కనెక్షన్లు 20 మిలియన్లు మాత్రమే ఉంటే, ప్రస్తుతం 850 మిలియన్లకు పెరిగాయన్నారు. గ్రామ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగాయన్నారు. ప్రస్తుతం 17,000 గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని చెప్పారు. 2014కు ముందు కేవలం 100 గ్రామ పంచాయితీలకు మాత్రమే నెట్ కనెక్షన్ ఉంద ని మోడీ చెప్పారు. 2030 నాటికి దేశంలో మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు 5జీ సేవలను ఉపయోగించేవారు ఉంటారని చెప్పారు. 5జీ సర్వీస్‌ల వల్ల దేశంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, లాజిస్టిక్, బ్యాంకింగ్ రంగాల్లో మౌలిక మార్పులు తీసుకు రానుందని టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రజలకు డిజిటల్ సర్వీసెస్ అందించే మీడియంగా ఉపయోగపడుతుందన్నారు. 5జీ సర్వీస్‌ల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ 2023 నుంచి 2040 నాటికి 455 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని జీఎస్‌ఎం అసోసియేషన్ అభిప్రాయపడింది. మొబైల్ కాంగ్రెస్ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. వీటిని టెలికమ్యూనికేషన్ల శాఖ(డాట్), సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
తొలుత 13 నగరాల్లో ప్రారంభం..
5జీ సేవలు ముందుగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నయ్, ఢిల్లి, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే, చండీగడ్ నగరాల్లో అందుబాటులోకి రానుంది. దేశంలో మూడు ప్రయివేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా 5జీ సేవలు అందించనున్నాయి.