దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కార్డుల ద్వారా జరుగుతున్న చెల్లింపులు పెరుగుతున్నాయి. సాధారణంగా షాపుల్లో చేస్తున్న కొనుగోళ్లలో కూడా ఆన్‌లైన్ చెల్లింపులు భారీగానే ఉంటున్నాయి. 75 శాతం ఆన్‌లైన్ లావాదేవీల్లో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం దేశంలో ఆన్‌లైన్ ద్వారా జరిగే కొనుగోళ్లలో మూడింట రెండు వంతులు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. డెబిట్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులు మూడింట ఒక వంతుగా ఉంటున్నాయి.
ఆఫ్‌లైన్‌లో జరుగుతున్న చెల్లింపుల్లో 50 శాతం క్రెడిట్ కార్డుల ద్వారానే జరుగుతున్నాయి. చెల్లింపుల్లోయూపీఐ కింగ్‌గా ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ చెల్లింపుల్లో మాత్రం క్రెడిట్ కార్డుల వాటా ఎక్కువగా ఉంది. దేశంలో పశ్చిమ ప్రాంతం, దక్షిణ భారత్‌లో క్రెడిట్ కార్డుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. 2019-20నుంచి 2023-24 ఆర్ధిక సంవత్సరాల్లో 75 నుంచి 80 శాతం క్రెడిట్ కార్డులు ఈ రెండు ప్రాంతాల్లోనే జారీ అయ్యాయి. ఎస్‌బీఐ కాకుండా మిగిలిన బ్యాంక్‌లు జారీ చేస్తున్న క్రెడిట్ కార్డులు సంవత్సరానికి 18 శాతంగా ఉన్నాయి.
కార్డుల జారీ, వాటి ద్వారా జరుగుతున్న వ్యయంలో వృద్ధి 20-25 శాతం ఆరోగ్యకరంగానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. బ్యాంక్‌లు తమ కస్టమర్లకు అధిక పరిమితి ఉన్న కార్డులను జారీ చేస్తున్నాయి. దీని వల్ల ఆయా కస్టమర్లు ఈ కార్డుల ద్వారా చేస్తున్న వ్యయాలు పెరుగుతున్నాయి. చెల్లింపులు కూడా అదే రీతిలో ఉంటున్నాయి. 25 వేల కంటే తక్కువ పరిమితితో జారీ చేస్తున్న క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్న వ్యయాలు 3 శాతంగా ఉంటున్నాయి.
మొత్తం క్రెడిట్ కార్డుల్లో 25 వేల నుంచి 2 లక్షల రూపాయల పరిమితి వరకు ఉన్నవి 60 శాతంగా ఉన్నాయి. కోవిడ్ తరువాత ఎక్కువ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డుల జారీ పెరిగింది. అదే సమయంలో తక్కువ పరిమితి ఉన్న కార్డుల జారీ తగ్గింది. ఖర్చు చేయడంలోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కార్డుల వృద్ధి విషయంలో కొంతమేర నెమ్మదించాయి. 35-40 శాతం వృద్ధి బహుళ నిలకడలేనిదని అంగీకరిస్తున్నామని, తక్కువ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డుల వృద్ధి క్షిణిస్తుందని కోటక్ ఇనిస్టిట్యూషన్ ఈక్విటీస్ సీఎఫ్‌ఏ ఎంబీ మహేష్ అభిప్రాయపడ్డారు.
ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడానికి ఈయా కార్డులు ఇస్తున్న ఆఫర్లు, ట్రావెల్ మైల్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్స్, అంగీకార స్థాయి అధికంగా ఉండటం, విదేశీ మారక ద్రవ్యం రేట్లు, ఎక్కువ వ్యయ పరిమితి వంటి అంశాలు దోహదం చేస్తున్నాయని వీసా ట్రావెల్ ఇంటర్నేషనల్ స్టడీ నివేదిక 2023 పేర్కొంది. 99 శాతం మంది ఇండియన్ ట్రావెలర్స్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ఈ నివేదిక తెలిపింది. కార్డులు క్రాస్ బోర్డర్ చెల్లింపులను తేలిక చేయడం వల్లే వీటి వినియోగం గణనీయంగా పెరుగుతున్నాయి.
2023 అక్టోబర్ నాటికి క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన వ్యయం 1.78 లక్షల కోట్లకు చేరాయి. అక్టోబర్‌లో పండుగల సీజన్ కావడంతో ఆన్‌లైన్ చెల్లింపులు భారీగా నమోదయ్యాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన వ్యయం 25.4 శాతం నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి 38.3 శాతానికి చేరింది. ఈ అక్టోబర్ లో ఈ-కామర్స్ సైట్స్ ద్వారా జరిగిన వ్యయం 17 శాతంగా ఉంది. ఈ సీజన్‌లో ఎక్కువగా మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లను ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా ఈ-కామర్స్ సైట్ల ద్వారా కొనుగోళ్లు జరిగాయి.
ఫెస్టివల్ సీజన్‌లో ఎక్కువ క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్లు, జీరో వడ్డీ ఆఫర్లు వంటివాటితో కార్డుల ద్వారా జరిగిన కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇటీవల అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా భారీగా అమ్మకాలు జరిగాయి. అమెజాన్ పే- ఐసీఐసీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా 65 శాతం కొనుగోళ్లు జరిగాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆఫ్షన్ కూడా ఆన్‌లైన్ కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు చెల్లింపులు పెరిగేందుకు దోహదం చేసింది.