దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. అయితే ప్రతీ నెల పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే.. కచ్చితంగా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటూ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపై ప్రభావం చూపుతున్నది. ఇంధనం నుంచి ఆహారం వరకు ప్రతీ దాని ధర భారీగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం తాండవిస్తున్నది. ఆకలి చావులు తప్పడం లేవు. దీనంతటికీ కారణం రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధమే అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన ద్రవ్యోల్బణంలో 59 శాతం వాటా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానిదే అని చెబుతున్నారు.
0.75 శాతం పెంపు!
ఏప్రిల్‌లో దేశీయ ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. కరోనా ముందు నాటి స్థాయికి రెపో రేటును 5.15 శాతానికి పెంచేందుకు ఆర్‌బీఐ మరో 0.75 శాతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై ద్రవ్యోల్బణం ప్రభావం ఏమేర ఉంటుంది అన్న అంశంపై తాము అధ్యయనం చేసినట్టు వివరించారు. 59 శాతం ద్రవ్యోల్బణం వాటా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉందని తెలిపారు. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరితో పోలిస్తే.. యుద్ధం కారణంగానే.. ఆహారం, పానియాలు, ఇంధనం, విద్యుత్, ట్రాన్స్‌పోర్టు ధరలు 52 శాతం పెరిగాయన్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో.. ఇన్‌పుట్ ధరల పెరుగుదలతో.. మరో 7 శాతం ప్రభావం పడింది. ఎప్పుడైనా ద్రవ్యోల్బణం సరిద్దే అవకాశం లేదని పేర్కొన్నారు. ధరల పెరుగుదల విషయానికొస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని వివరించారు.
రైతన్నకు అదనపు భారం..
గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై తీవ్ర ప్రభావం పడింది. ఆహార ధరల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా.. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. రాబోయే జూన్, ఆగస్టు పాలసీలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఆగస్టు నాటికి 5.15 శాతానికి వెళ్తుందని ఎస్‌బీఐ నిపుణులు చెబుతున్నారు. యుద్ధ పరిణామాలు అదుపులోకి రాకపోతే.. వడ్డీ రేట్ల పెంపుదలతో ద్రవ్యోల్బణం తగ్గుతుందా.. అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించాలని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రతీ ఒక్కరినీ ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైన అంశంగా పరిగణించబడుతుందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..