Friday, November 22, 2024

6 లక్షల కోట్లు దాటిన ద్రవ్యలోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో దేశ ద్రవ్యలోటు 37.3 శాతంగా ఉంది. సోమవారం నాడు అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఖర్చులు, ఆదాయం మధ్య ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో 6,19,849 కోట్లుగా ఉందని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో 35 శాతంగా ఉంది. ఈ కాలంలో ప్రభుత్వం మొత్తం ఆదాయం 12.03 లక్షల కోట్లుగా ఉంది, 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో 52.7 శాతమని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ) తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో 55.6 శాతంగా ఉందని పేర్కొంది.

ఈ కాలంలో పన్నుల ఆదాయం 10.11 లక్షల కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్‌లో వేసిన అంచానాల్లో 52.3 శాతంగా ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మొత్తం ఖర్చు 18.23 లక్షల కోట్లుగా నమోదైంది. 2022-23 బడ్జెట్‌ అంచానాల్లో ఇది 46.2 శాతం. గత సంవత్సరం ఇది 46.7 శాతంగా నమోదైంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోలోటు 16.61 లక్షల కోట్లుగా ఉంటుందని , ఇది జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ అంచనా ప్రకారం పెట్టుబడి వ్యయం 45.7 శాతం ఉంటుందని పేర్కొంది. మొత్తం రెవెన్యూ వ్యయంలో 4.36 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు పోతుందని, 1.98 లక్షల కోట్లు ప్రధానమైన సబ్సిడీలకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement