జీఎస్టీ చెల్లింపుల్‌లోనూ భారీగా మోసాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానికి 55,575 కోట్లు గండిపడింది. కొందరు ఎగవేతకు పాల్పడుతూ, దొడ్డిదారిన దండుకుంటున్నారు. ఖజానాకు నష్టం కలిగిస్తున్న దాదాపు 700 మందిని అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్‌కు చెందిన డైరెక్టరేట్ జనరల్ (డీజీజీఐ) అధికారులు 22,300 నకిలీ జీఎస్‌టీ నంబర్లను గుర్తించారు. జీఎస్‌టీ మోసాలను గుర్తించేందుకు 2020 నవంబర్ 9న ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. నాటి నుంచి ఇప్పటి వరకు అనేక మోసాలను గుర్తించి, బాధ్యులను అరెస్టు చేసింది. ఈ కేసుల్లో ఎంతమొత్తం రికవరీ చేశామనే అంశాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
డీజీజీఐ, డీఆర్‌ఐ, ఆదాయపన్ను, ఈడీ, సీబీఐ మధ్య సమన్వయం వల్లే నిందితుల గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. రిజిస్ట్రేషన్ తనిఖీ, ఇ-వే బిల్లులు, జీఎస్‌టీ రిటర్నుల ధ్రువీకరణ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింపైపరిమితి వంటి చర్యల ద్వారా పన్ను ఎగవేతను అరికడుతున్నారు. ఫలితంగా నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు కొత్త రికార్డులకు చేరుతున్నాయి. గత కొన్ని మాసాలుగా సగటు పన్ను వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లకు పైగానే ఉంటున్నాయి.