యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో పాటు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ప్రమోటర్స్ కపిల్, ధీరజ్ వధ్వాన్‌లు కలిసి రూ.5,050 కోట్ల నిధులను దారి మళ్లించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం ప్రకటించారు. ఈ కేసు విషయమై.. ఇప్పటి వరకు రెండో అనుబంధ (మొత్తం మూడు) చార్జ్‌షీట్‌లను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసినట్టు వివరించారు. అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడటంతో రాణా కపూర్, అతని కుటుంబ సభ్యులు, వధ్వాన్ సోదరులతో పాటు ఇతరులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ఈ మోసంలో అధిక మొత్తంలో నిధులు విదేశాలకు తరలించారని విచారణలో తేలిందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద విదేశాల్లోని ఆస్తులను నేరుగా అటాచ్ చేయలేకపోతున్నట్టు తెలిపింది. నేరపూరిత కుట్రలో రాణా కపూర్, కపిల్ వధ్వాన్, ధీరజ్ వధ్వాన్‌తో పాటు ఇతరుల ప్రమేయం కూడా గుర్తించినట్టు ఈడీ పేర్కొంది.
నిబంధనలకు విరుద్ధంగా..
అందరూ నిబంధనలకు విరుద్ధంగా నిధులను పక్కదారి పట్టించారని, దాని విలువ మొత్తం రూ.5,050కోట్లుగా ఉంటుందని వివరించారు. ఏప్రిల్ 2018 నుంచి జూన్ 2018 మధ్య కాలంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన రూ.3,700 కోట్ల విలువైన డిబెంచర్లను యస్ బ్యాంక్ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఆ డబ్బును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బదిలీ చేశాక.. రాణా కపూర్, ఆయన కుటుంబానికి చెందిన డీవోఐటీ అర్బన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డీహెచ్‌ఎఫ్‌ఎల్ రూ.600 కోట్ల రుణాన్ని జారీ చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన స్వల్పకాల డిబెంచర్లను కొనుగోలు చేసేందుకు యస్ బ్యాంక్ ప్రజా ధనాన్ని వినియోగించినట్టు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఇంతవరకు తిరిగి చెల్లించలేదు. మరోవైపు నిబంధనలు పాటించకుండానే రాణా కపూర్ కుటుంబానికి చెందిన కంపెనీ డీయూవీపీఎల్‌కు రూ.600 కోట్ల రుణం ఇచ్చినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఆస్తుల విలువను మరింత ఎక్కువగా చూపించి.. అధిక మొత్తంలో డబ్బులు కాజేసినట్టు వివరించారు. రాణా కపూర్, కపిల్, ధీరజ్ వధ్వాన్‌ల మధ్య ఈ చట్టవ్యతిరేక లావాదేవీలు జరిగినట్టు తెలిపారు. డీయూవీపీఎల్‌కు రూ.600 కోట్ల రుణం ఇచ్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్పత్తి లేదు. ఎలాంటి ఆదాయం నమోదు చేయలేదు. రుణాన్ని మళ్లీ చెల్లించే పరిస్థితిలో కంపెనీ లేదు. క్విడ్ ప్రో కో మాదిరిగానే ఈ కేసు కనిపిస్తున్నది. అధికారిక హోదాను రాణా కపూర్ మిస్ యూజ్ చేశాడు. దీనికితోడు తాను, తన కుటుంబానికి ఆర్థికంగా లబ్ది చేకూర్చేందుకు నిబంధనలను ఉల్లంఘించారని చార్జిషీట్‌లో ఈడీ అధికారులు పొందుపర్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..