Friday, November 22, 2024

Vande Barat | వచ్చే ఏడాది 500 వందేభారత్‌ రైళ్లు, స్లీపర్‌ కోచ్‌లు

భారతీయ రైల్వేలు ఆధునీకరణ వైపుగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న వందేభారత్‌ రైళ్ల సంఖ్యను భారీగా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వచ్చే సంవత్సరం 500 వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టనుంది. ప్రయాణికుల భద్రత విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుటోంది. వందేభారత్‌ కోచ్‌ల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికులు రక్షణ కోసం యాంటీ ఇంజూరీ ఫిటింగ్స్‌ను కోచ్‌ల్లో ఏర్పాటు చేస్తున్నారు.

వచ్చే సంవత్సరం 500-550 వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెన్నయ్‌లోని ఇంటిగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం 75 వందేభారత్‌ రైళ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 63 రైళ్లు 8 కోచ్‌లు ఉండేవని, 12 రైళ్లు 16 కోచ్‌లు ఉండేవి ఉన్నాయని ఆయన తెలిపారు.

వీటితో పాటు 1,700 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, 700 వందేభారత్‌ కోచ్‌లను కూడా తయారు చేయనున్నట్లు తెలిపారు. 750 ఈఎంయూ టైప్‌ కోచ్‌లను, వంద స్పెషల్‌ కోచ్‌లను తయారు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 3,250 కోచ్‌లను తయారు చేయనున్నట్లు మాల్యా వెల్లడించారు.

రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణికులు సాధ్యమైనంత వరకు గాయపడకుండా రక్షించేందుకు రైల్వే శాఖ కోచ్‌ల్లో యాంటీ ఇంజూరీ ఫిట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. పదునైన పరికరాల మూలంగా గాయలు ఎక్కువగా ఉంటున్నాయని, దీన్ని నివారించేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం మెటల్‌ హ్యాంగర్స్‌, లగేజీ ర్యాక్స్‌ వంటి వాటి మూలంగా ప్రమాదాలు జరిగినసమయంలో వీటి మూలంగా ప్రయాణికులు ఎక్కువగా గాయపడుతున్నారు. అందువల్ల ఇక నుంచి తయారు చేసే కోచ్‌ల్లో ఇలాంటి వాటి కి ప్రత్యామ్నాయం చూడాలని రైల్వే శాఖ కోరింది. దీంతో ఈ కోచ్‌ల్లో యాంటీ ఇంజూరీ ఫిట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఎల్‌సీఎఫ్‌ డిజైన్‌ కోచ్‌ల స్థానంలో జర్మనీ టెక్నాలజీతో రూపొందే లింక్‌ హాఫ్‌మెనన్‌ బూష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ కోచ్‌లు ఒకదానిపైకి ఒకటి వెళ్లే అవకాశం ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి. వచ్చే సంవత్సరం నుంచే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది.

దూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా వీటిని ప్రవేశపెడుతోంది. ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఒక రైల్వే శాఖ వందేభారత్‌ సాధారణ్‌ రైళ్లను కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వేగంగా నడిచే ఈ రైళ్లను సామాన్యులకు కూడా దగ్గర చేసేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement