ఎయిర్ ఇండియా భారీ సంఖ్యలో కొత్త విమానాలను సమకూర్చుకోనుంది. 500 కొత్త విమానాల కొనుగోలుకు సంబందించి బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలకు ఆర్డర్ ఇవ్వనుంది. ఈ డీల్ తుది దశలో ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియా 400 వరకు చిన్న విమానాలు, 100కు పైగా పెద్ద విమానాలు ఉన్నాయని ఈ వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా సమకూర్చుకోనున్న కొత్త విమానాల్లో ఎయిర్‌బస్ ఏ350 విమానాలు, బోయింగ్ 787, 777 విమానాలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలతో టాటా గ్రూప్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. కొద్ద రోజుల్లోనే ఈ కొత్త విమానాల ఆర్డర్‌ను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపాయి.
మొత్తం విమానాల కొనుగోలు విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంత భారీ సంఖ్యలో ఒకే సారి కొత్త విమానాల కొనుగోలుకు ఇంత వరకు ఏ సంస్థ ఇవ్వలేదని తెలిపారు. చాలా సంవత్సరాల క్రిత ం అమెరికాకు చెందిన విమానాయాన సంస్థ 460 ఎయిర్ బస్, బోయింగ్ జెట్ విమానాలను కొనుగోలు చేసింది.
కరోనా తరువాత విమానయాన రంగం పూర్తి స్థాయిలో కోలుకుంటోంది. ప్రయాణీకుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా సర్వీస్‌లు పెంచుకునేందుకు కొత్త విమానాలను కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తరువాత టాటా గ్రూప్ వేగంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారాలోని మోజార్టీ వాటాను కొనుగోలు చేసింది.
అదే విధంగా ఎయిర్ ఏషియాలోనూ మోజార్టీ వాటాను కొనుగోలు చేసి రెండు సంస్థలను ఎయిర్ ఇండియాలో విలీనం చేసింది. ఈ విలీనంతో ప్రస్తుతం టాటా గ్రూప్‌లో 218 విమానాలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ సర్వీస్‌లను గణనీయంగా పెంచుకోవాలని టాటా నిర్ణయించింది. ఇందుకోసమే భారీ సంఖ్యలో కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా దేశీయ, విదేశీ సర్వీస్‌ల్లో ఇండిగో తరువాత రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రంగాల్లోనూ అగ్రస్థానమే లక్ష్యంగా టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.