Saturday, November 23, 2024

మూడు రోజుల్లో 4,500 కోట్లు.. భారీగా ఎఫ్‌పీఐల విక్రయాలు..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ద్రవ్యోల్బణ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు.. శాంఘైలో లాక్‌డౌన్‌ వంటి కీలక పరిణామాల నేపథ్యంలో.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనికితోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు వేగంగా చేపడుతామన్న ప్రకటన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు అడుగులు వేసేలా చేస్తున్నది. గత వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు మూడు రోజులే కొనసాగాయి. ఈ మూడు రోజుల్లోనే.. రూ.4,500 కోట్ల విలువ చేసే స్టాక్స్‌ను విక్రయించారు. బుధవారంతోనే మార్కెట్లు ముగిశాయి. గురువారం అంబేద్కర్‌ జయంతి, శుక్రవారం గుడ్‌ ఫ్రైడే కారణంగా మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. ఆ తరువాత శని, ఆదివారాలు యథావిధిగా సెలవు రోజులు. ఏప్రిల్‌ 8వ తేదీతో ముగిసిన వారంలో మార్కెట్లలో వచ్చిన కరెక్షన్‌ కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు రూ.7,707 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.

6 నెలల పాటు విక్రయాలు..

2022 మార్చి కంటే 6 నెలల ముందు నుంచే ఎఫ్‌పీఐలు నెట్‌ సెల్లర్స్‌గానే ఉన్నారు. సుమారు రూ.148 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఫలితంగా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయని చెప్పుకోవాలి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొన్ని రోజుల క్రితం వరకు ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గాయి. మళ్లిd ఇరు దేశాల మధ్య వార్‌ ప్రారంభమైంది. ఈ వివాదం సద్దుమణిగితే.. ఎఫ్‌పీఐలు తిరిగి భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడ్తారని రైట్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు సోనమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్‌ సంకేతాలు, భారత్‌లో అంచనాలను మించిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వివరించారు. ఈక్విటీ మార్కెట్లతో పాటు డెట్‌ మార్కెట్ల నుంచి కూడా గతవారం ఎఫ్‌పీఐలు రూ.415 కోట్లు విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు క్రితం వారం రూ.1,403 కోట్ల నిధులను మదుపు చేయడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement