విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీకి వినియోగించే సహజవాయువు ధరలను కేంద్ర ప్రభుత్వం 40 శాతం పెంచింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా నాచురల్ గ్యాస్ ధరను పెంచుతున్నట్లు చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) తెలిపింది. ఈ రోజు (అక్టోబర్ 1) నుంచి ఆరు నెలల పాటు ఈ ధరలు అమల్లో ఉటాయని పేర్కొంది. వాహనాల్లో సీఎన్‌జీగా, ఇళ్లలో వంట కోసం సహజ వాయువును ఉపయోగిస్తున్నారు. సీఎన్‌జీ ధరలు పెరిగితే వాహనదారులపై భారంపడుతుంది. ధర పెంపుతో ఓఎన్‌జీసీ క్షేత్రాల నుంచి వెలికితీస్తున్న గ్యాస్ ధర ఒక్కో మిలియన్ బ్రిటీష్ ధర్మల్ యూనిట్‌కు ప్రస్తుతం ఉన్న 6.10 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు పెంచారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కలిపి కేజీ డీ6 బ్లాక్‌లో వెలికి తీసున్న గ్యాస్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న 9.92 డాలర్ల రేటును ఇక నుంచి 12.6 డాలర్లకు పెంచారు. సహజ వాయువు ధరలను ప్రతి ఆరు నెలలకోసారి కేంద్రం సవరిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్1, అక్టోబర్ 1న కొత్త ధరలు అమల్లోకి వస్తుంటాయి.