ఈ ఆర్ధిక సంవత్సరం పబ్లిక్ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, మార్కెట్ల పనితీరు ఆశించనదానికంటే బాగుండటం వంటి కారణాలతో కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. చాలా కాలంగా వేచి చూస్తున్న కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌తో లైన్ కడుతున్నాయి. వచ్చేవారం మార్కెట్‌లోకి మూడు ఐపీఓలు రానున్నాయి.
ఈ మూడు సంస్థలు 2,201 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగుండడంతో ఐపీఓకు మంచి స్పందన వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మాహి హోటల్స్, జాగిల్ ప్రీపెయిడ్ సర్వీసెస్, యాత్రా ఆన్‌లైన్ ఐపీఓల ఐపీఓలు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. వీటితోపాటు ఈ వారం ఈఎంఎస్ లిమిటెడ్, జ్యూపిటర్ లైఫ్ లైన్ ఆస్పటల్స్ ఐపీఓలు కొత్తగా రానున్నాయి.
సాయి సిల్క్స్ ఐపీఓ…
ఈ వారం ప్రారంభం కానున్న వాటిలో సాయి సిల్క్స్ కళామందిర్ పబ్లిక్ ఆఫర్ అన్నింటి కంటే పెద్దది. ఈ సంస్థ ఐపీఓ ద్వారా 1,201 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. సాయి సిల్క్స్ ఐపీఓ సెప్టెంబర్ 20న ప్రారంభమై 22వ తేదీన ముగుస్తుంది. ఈ సంస్థ ఐపీఓ షేర్ ధరను 210-222 రూపాయలుగా నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 67 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది.
ఆఫర్ ఫర్ సేల్ కింద 2.7 కోట్ల షేర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఐపీఓలో 50 శాతం ఈక్విటీ షేర్లను అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. 15 శాతం షేర్లను సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. 35 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్‌కు కేటాయించారు.
సిగ్నేచర్ గ్లోబల్ ఐపీఓ
సిగ్నేచర్ గ్లోబల్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 20న ప్రారంభమై, 22న ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా 730 కోట్లు సమీకరించనున్నారు. ఈ సంస్థ గతంలో ఐపీఓ ద్వారా 1000 కోట్లు సమీకరించాలని నిర్ణయించినప్పటికీ, తరువాత ఈ లక్ష్యాన్ని 730 కోట్లకు తగ్గించుకుంది.
ఐపీఓలో 603 కోట్ల మేరకు ప్రెష్ ఇష్యూ ద్వారా సమీకరిస్తారు. 127 కోట్ల రూపాయలను ప్రస్తుతం ఉన్న షేరు హోల్డర్ ఇంటర్నేషనల్ ఫౖౖెనాన్స్ కార్పోరేషన్ నుంచి సమీకరించనుంది. ఈ సంస్థ ఇష్యూ జారీ ధరను 366-385 రూపాయల మధ్య నిర్ణయించారు. సిగ్నేచరల్ గ్లోబల్ సంస్థ దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా ఉంది.
వైభవ్ జ్యువెల్లరీస్…
వైభవ్ జ్యువెల్లరీస్ ఐపీఓ సెప్టెంబర్ 22న ప్రారంభమై సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 270 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. షేరు ధరను 204-215 రూపాయలుగా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్లకు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది.