Tuesday, November 26, 2024

Business | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభంలో 29 శాతం వృద్ధి.. ప్రపంచంలో 7వ పెద్ద బ్యాంక్‌గా ఆవిర్భావం

ప్రైవేటురంగ దిగ్గజ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.12,370.38 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 29.13 శాతం పెరగడం గమనార్హం. గతేడాది రూ.9,579.11 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించగా, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.12,594.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.23,599 కోట్లుగా నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆదాయం రూ.62,021 కోట్లకు పెరిగింది.

గతేడాది ఆదాయం రూ.44,202 కోట్లు మాత్రమే. నిర్వహణ వ్యయాలు రూ.11,355 కోట్ల నుంచి రూ.15,177 కోట్లకు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది 1.28 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు 1.17 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 19 శాతం పెరిగి 19.13 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనంతరం వెలువడిన తొలి ఫలితాలు ఇవే కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

- Advertisement -

జూన్‌ చివరి నాటికి బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 19 శాతం వృద్ధితో రూ.19.13 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్‌ ఖాతా పొదుపు ఖాతా డిపాజిట్లు దాదాపు 11శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లలో 42.5 శాతానికి చేరాయి. దేశీయ రిటైల్‌ రుణాలు 20 శాతం బలమైన వృద్ధిని సాధించడంతో మొత్తం అడ్వాన్స్‌ గత ఏడాదితో పోలిస్తే 16 శాతం పెరిగి రూ.16.16 లక్షల కోట్లకు చేరుకుంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్‌ రుణాలు 29 శాతం వృద్ధి చెందగా, కార్పొరేట్‌, ఇతర టోకు రుణాలు కూడా 11.2 శాతం పెరిగాయి. ఫలితాల వెల్లడి నేపథ్యంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో 12 శాతం పెరిగి రూ.1,664.75 వద్ద ట్రేడవుతున్నాయి.

ప్రపంచంలో 7వ అతిపెద్ద బ్యాంకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం తర్వాత ఈ సంస్థ మార్కెట్‌ క్యాప్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్కును దాటింది. దీంతో గ్లోబల్‌ క్లబ్‌ ఆఫ్‌ కంపెనీల ప్రత్యేక జాబితాలోకి ప్రవేశించింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ దాదాపు 151 బిలియన్‌ డాలర్లు లేదా రూ.12.38 లక్షల కోట్లతో ట్రేడవుతోంది. మోర్గాన్‌ స్టాన్లి, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వంటి వాటిని అధిగమించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఇప్పుడు ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద రుణదాతగా అవతరించింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ జెపి మోర్గాన్‌ కంటే 438 బిలియన్‌ డాలర్లు, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 232 బిలియన్‌ డాలర్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా 224 బిలియన్‌ డాలర్లు, అగ్రికల్చరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా 171 బిలియన్‌ డాలర్లు, వెల్స్‌ ఫార్గో 163 బిలియన్‌ డాలర్లు, హెచ్‌ఎస్‌బిసి 160 బిలియన్‌ డాలర్ల తర్వాతి స్థానంలో నిలిచింది. విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ మోర్గాన్‌ స్టాన్లి (143 బిలియన్‌ డాలర్లు), గోల్డ్‌మన్‌ సాచ్స్‌ (108 బిలియన్‌ డాలర్లు) వంటి ప్రధాన ప్రపంచ పెట్టుబడి సంస్థలను అధిగమించింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌ విలువ పరంగా చూస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ. 18.6 లక్షల కోట్లు), టీసీఎస్‌ (రూ. 12.9 లక్షల కోట్లు) తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ మూడవ అతిపెద్ద భారతీయ కంపెనీగా అవతరించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement