చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంక్‌లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం నాడు తెలిపింది. ఈ నోటును ఉపసంహరించుకుని 9 నెలలు దాటినప్పటికీ ఇంకా 8,470 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. 2వేల నోట్లు ఇప్పటికీ లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఈ నోట్‌కు కేంద్ర బ్యాంక్ గత ఏడాది మే 19న ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడే నాటికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. బ్యాంక్‌ల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు ప్రజలకు తొలుత సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 7 వరకు గడువు పెంచారు. దీని తరువాత 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే స్వీకరిస్తున్నారు. ఆర్‌బీఐ కార్యాలయాల్లో నేరుగాకాని, పోస్ట్ ద్వారా పంపించి కాని 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. ఫిబ్రవరి 29 నాటికి 97.62 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.