Monday, September 30, 2024

Cyber Fraud | 2.17 కోట్ల సిమ్‌ కార్డులు రద్దు..

దేశంలో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. మొబైల్‌ ద్వారా జరుగుతున్న ఇలాంటి మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా నకిలీ పత్రాలు సమర్పించి పొందిన, సైబర్‌ క్రైమ్‌లో ప్రమేయం ఉన్న సిమ్‌ కార్డులను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.

దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాదాపు 2.17 కోట్ల సిమ్‌ కార్డులు రద్దు అవుతాయి. సిమ్‌ కార్డులతో వీటిని ఉపయోగించిన 2.26 లక్షల మొబైల్‌ ఫోన్లను కూడా బ్లాక్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికం శాఖ సమర్పించింది.

ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌, ఆర్‌బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఐటీ శాఖ, సీబీఐకు చెందిన అధికారులు, ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సిమ్‌ కార్డులు జారీ చేసే సమయంలో నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ)ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఇటీవల కంబోడియా కేంద్రంగా సైబర్‌ నేరాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. డేటా ఎంట్రీ పోస్టులకు భారీగా వేతనం ఆశ చూపి 5 వేల మందికి పైగా భారతీయులను దీని కోసం వినియోగించుకుంటున్నారు. దీంతో భారతీయ టెలికం నెంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేయాలని టెలికం శాఖ టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement