ఎయిర్ ఇండియాకు 18 నెలల పాటు ప్రతి 6 రోజులకో కొత్త విమానం రానుంది. ఎయిర్ ఇండియా 470 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ కొత్త విమానాలు ప్రతి 6 రోజులకు ఒకటి రానుందని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ శుక్రవారం నాడు తెలిపారు. సింగపూర్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఎయిర్‌లైన్స్ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వివరాలను తెలిపారు.
కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌ల కోసం సిబ్బందిని నియామించుకుని వారికి శిక్షణ కూడా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. తాము చేయాల్సిన పని చాలా ఉందన్నారు. ఈ విషయంలో తాము మంచి పురోగతిని సాధించామని చెప్పారు. ఎయిర్ ఇండియా కస్టమర్లు చాలా మంది విశ్వసనీయత, సమయపాలనను కోరుకుంటున్నారని, వీరిని సంతృప్తి పరచడం తమ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పారు.
ఎయిర్ ఇండియాకు సమకూరనున్న కొత్త విమానాలను ఎక్కువగా అంతర్జాతీయ రూట్లలో నడిపించనున్నామని చెప్పారు. గతంలో నిలిపివేసిన ప్లాన్స్‌ను మళ్లి ప్రారంభిస్తామన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ 8 శాతం వృద్ధి దిశగా ఉందని, ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో వృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఇతర విమానాయాన సంస్థలతో పోటీ పడి తగినంత ట్రాఫిక్‌ను ఎయిర్ ఇండియా సాధించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇండియాలో 2019 నాటి కంటే అధికంగా 20 శాతం వరకు చేరిందన్నారు. ఎయిర్ ట్రాఫిక్ విషయంలో ఏషియా పసిఫిక్ ఎయిర్ ట్రావెల్ రికవరీ 69 శబుూతం ఉందని, ఇతర రీజియన్స్‌తో పోల్చితే వెనుకబడి ఉన్నామని అసోసియేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఎయిర్‌లైనర్స్ డైరెక్టర్ జనరల్ సుభాష్ మీనన్ చెప్పారు.
అయితే ఏషియా పసిఫిక్ ట్రాఫిక్ 2022తో పోల్చితే 171 శాతం పెరిగిందని, అదే సమయంలో సామర్ధ్యం మాత్రం 130 శాతమే పెరిగిందన్నారు. ఏషియా ఎయిర్ ట్రావెల్ రికవరీ చాలా ఆలస్యంగా జరిగిందన్నారు. యూరోప్‌కు అవసరమైన సర్వీస్‌లను నడిపించంలో వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. యూరోప్ స్లాట్స్‌ను కోల్పోవడం వల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య సర్వీస్‌లు నడపడంలో నష్టం జరిగిందన్నారు.