దేశంలో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. వినియోగదారులు యూపీఐ చెల్లింపులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో 12.02 బిలియన్ల లావాదేవీలు జరగగా, 18.23 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. నవంబర్ నెలతో పోల్చితే చెల్లింపుల్లో 5 శాతం, లావాదేవీల్లో 7 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం 2023లో యూపీఐ లావాదేవీలు 117.6 బిలియన్లుగా ఉంటే, చెల్లింపులు 183 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022తో పోల్చుకుంటే లావాదేవీల్లో 59 శాతం, చెల్లింపుల్లో 45 శాతం పెరుగుదల నమోదైంది.
2023 నవంబర్‌లో 11.24 బిలియన్ల లావాదేవీలు జరిగితే, 17.4 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. 2022 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ డిసెంబర్‌లో లావాదేవీల్లో 54 శాతం, చెల్లింపుల్లో 42 శాతం వృద్ధి నమోదైంది. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన వివరాల ప్రకారం 2023లో అత్యధికంగా అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీలు, చెల్లింపులు జరిగాయి. అక్టోబర్‌లో 11.41 బిలియన్ల లావాదేవీలు జరిగాయి.
ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలు డిసెంబర్ 6 శాతం పెరిగి 499 మిలియన్లుగా నమోదయ్యాయి. నవంబర్‌లో 472 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. డిసెంబర్‌లో 5.7 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023 నవంబర్‌లో 5.35 లక్షల కోట్ల రూపాయల ఐఎంపీఎస్ చెల్లింపులు జరిగాయి. డిసెంబర్‌లో 348 మిలియన్ల ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. నవంబర్‌లో జరిగిన 321 లావాదేవీలతో పోల్చితే డిసెంబర్‌లో 8 శాతం పెరిగాయి. డిసెంబర్‌లో చెల్లింపులు 11 శాతం పెరిగి 5,861 కోట్లుగా నమోదయ్యాయి.
నవంబర్‌లో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా 5,303 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. డిసెంబర్ నెలలో ఆధార్ ఆధారిత చెల్లింపులు (ఏఈపీఎస్) 14 శాతం తగ్గి 95 మిలియన్లుగా ఉన్నాయి. నవంబర్‌లో ఇది 110 మిలియన్లుగా ఉన్నాయి. నవంబర్‌లో జరిగిన 29,640 కోట్ల రూపాయల చెల్లింపులతో పోల్చితే 15 శాతం తగ్గి డిసెంబర్‌లో 25,162 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. 2023 నవంబర్‌లో ఏఈపీఎస్ లావాదేవీలు 100 మిలియన్లుగా ఉన్నాయి. చెల్లింపులు 25,,973 కోట్లుగా నమోదయ్యాయి.
యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు…
యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దేశంలో చెల్లింపుల విధానాన్ని మార్చింది. స్వల్పకాలంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా యూపీఐ మారింది. దీని వినియోగాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా ఆర్‌బీఐ 2024 జనవరి 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి తీసుకువచ్చింది. యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని జనవరి నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి 15,000 రూపాయలుగా ఉంది.
బీమా ప్రీమియం చెల్లింపు పద్ధతులు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకూ ఈ పరిమితి పెంపు వర్తి వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. కార్డులు, ప్రీపెయిడ్ చెల్లింపు పద్దతులు, యూపీఐలపై ఇ-మ్యాండేట్‌లు, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ల ప్రాసెసింగ్‌లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) సడలింపు ఉంటుంది. ఇప్పటి వరకు ఆస్పత్రతులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతి ఉండేది. ఇకపై దీన్ని 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గతంలో ప్రకటించింది.
ఫలితంగా ఆయా చోట్లు యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుంది. ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు, నంబర్లు వినియోగంలో లేకపోతే అవి డియాక్టివేట్ అవుతాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) గత నవంబర్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ వాలెట్లు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)ని ఉపయోగించి చేసే యూపీఐ చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ వర్తించనుంది. 2,000 పైన చేసే మర్చింట్ లావాదేవీలపై మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు.
బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు తేడా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఇకపై యూపీఐ యూప్‌ల నుంచి ఎవరికి చెల్లింపులు చ ఏసినా వారి బ్యాంక్ అకౌంట్‌లో ఉండే పూర్తి పేరు తెరపై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్‌బీఐ జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఫలితంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది.
ఈ తరహా ఏటీఎంలు దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. త్వరలో యూపీఐ ట్యాప్ అండ్ పే విధానాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తామని ఎన్‌పీసీఐ ఆ మధ్య ప్రకటించింది. అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరంలేకుండానే చెల్లింపులు చ ఏసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇందుకు ఫోన్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్ అందుబాటులో ఉండాలి.
యూపీఐ ద్వారా కొత్తవారికి చేసే తొలి చెల్లింపు మొత్తం 2,000 దాటితో లావాదేవీ పూర్తి కావడానికి నాలుగు గంటల సమయం పట్టేలా మార్పులు చేసే యోచనలో ఎన్‌పీసీఐ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మోసపూరిత లావాదేవీలను అరికట్టడంలో భాగంగా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.