ఫిబ్రవరి వాహన రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగినట్లు ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం నాడు తెలిపింది. అన్ని విభాగాల వాహనాల అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. అంతకు ముందు సంవత్సరం ఫిబ్రవరి నెలలో 17,94,866 యూనిట్ల విక్రయాలు జరిగితే, 2024 ఫి బ్రవరిలో ఈ సంఖ్య 20,29,541 యూనిట్లుగా ఉందని ఫాడా తెలిపింది. ప్రయాణికుల వాహన విక్రయాలు 2023 ఫిబ్రవరిలో 2,29,803 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఈ సారి అవి 12 శాతం పెరిగి 3,30,107 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఈ విభాగంలో ఇప్పటివరకు ఇదే రికార్డు. కొత్త కార్ల విడుదల, వాహనాలు అందుబాటులో ఉండడమే రికార్డు స్థాయి అమ్మకాలకు దోహదం చేసినట్లు ఫాడా తెలిపింది. ద్విచక్ర వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగి 14,39,523 యూనిట్లకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, ఎంట్రీ లెవెల్ బైక్‌లకు ఆదరణ వంటి కారణాలు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసినట్లు ఫాడా తెలిపింది.
పెళ్లిళ్ల సీజన్, ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం కూడా అమ్మకాలకు కలిసి వచ్చిందని తెలిపింది. వాణిజ్య వాహన విక్రయాలు గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగి 88,367 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎన్నికల సీజన్ కావడంతో కొనుగోళ్లు వాయిదా వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విభాగంలో వృద్ధి నమోదైనట్లు తెలిపింది. త్రిచక్ర వాహన అమ్మకాలు 24 శాతం పెరిగి 94,918 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్లు అమ్మకాలు 11 శాతం పెరిగి 76,626కు చేరాయి.
పీవీ ఇండస్ట్రీ 9శాతం పెరిగే అవకాశం: ఇక్రా
దేశీయంగా ప్యాసింజర్ వాహన పరిశ్రమ ఈ ఆర్ధిక సంవత్సరంలో 6-9 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. వ్యాసింజర్ వాహనాల అమ్మకాలు 40.2 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. బలమైన రిటైల్ అమ్మకాలు ఉన్నప్పటికీ డీలర్ల ఇన్వెంటరీలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి వేగం తగ్గుతుందని ఇక్రా అంచనా వేసింది.
పండగల సీజన్‌లో రిటైల్ అమ్మకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. యుటిలిటీ వాహనాలు (యూవీ) విభాగం పెరుగుదల కొనసాగుతుందని నివేదిక తెలిపింది. కార్ల అమ్మకాల్లో ఎంట్రీ లెవెల్ విభాగంలో అమ్మకాలు పెద్దగా పెరగవని పేర్కొంది. మార్కెట్‌లోకి కొత్త వాహనాలు వస్తున్నందున విద్యుత్, సీఎన్‌జీ విభాగంలో వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతాయని ఇక్రా తెలిపింది. వచ్చే ఆర్ధిక సంవత్సరాల్లో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మన్యూఫ్యాక్చరర్ మూలధన వ్యయం ఎక్కువగానే ఉంటుందని ఇక్రా తెలిపింది.