దేశీయ స్టాక్మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్లో ఇప్పటి వరకు 12 వేల కోట్లు పెట్టబడులు పెట్టారు. వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఇంకా నిర్ణయం తీసుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడుల కొనసాగిస్తున్నారు. ఆగస్టులో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 51,200 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వరసగా అనేక నెలల పాటు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు మొదటిసారిగా జులైలో 5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2021 అక్టోబర్ నుంచి 2022 జూన్ నాటికి విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుం చి 2.46 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
ఈ సెప్టెంబర్లో ఇప్పటి వరకు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 12,084 కోట్లు ఈక్విటీ మార్కెట్లో పెట్టబడులు పెట్టారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం వృద్ధి రేటు ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ, ఈ నెల మిగిలిన రోజుల్లో కూడా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంతో పాటు ఇండోనేషియా, పిలిఫి న్ దేశాల ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ వంటి దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.