రానున్న పది సంవత్సరాల్లో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందిన గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ప్రధానంగా ఈ పె ట్టుబడులు న్యూఎనర్జీ, డిజిటల్ స్పేస్‌లో పెట్టనున్నట్లు చెప్పారు. మొత్తం పెట్టుబడిలో 70 శాతం ఎనర్జీ రంగంలో పెట్టనున్నట్లు ప్రకటించారు. సింగపూర్‌లో జరిగిన గ్లోబల్ సీఈఓ సదస్సులో అదానీ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన అదానీ గ్రూప్ వ్యాపార ప్రణాళికలను వివరించారు. న్యూ ఎనర్జీ వ్యాపార విస్తరణలో భాగంగా 45 గిగావాట్స్ సామర్ధ్యం కలిగిన హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుదుత్పత్తితో పాటు మూడు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న 20 గిగావాట్స్ పునరుత్పాదక పోర్ట్‌ఫోలియోకు అదనంగా 45 గిగావాట్స్ హైబ్రిడ్ పునరుద్పాతక విద్యుత్ ఉత్పత్తిని లక్ష హెక్టార్ల స్థలంలో చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సింగపూర్ భూభాగం కంటే 1.4 రేట్లు ఎక్కువని చెప్పారు. ఇది మూడు మిలియన్ టన్నుల వాణిజ్యపరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. మూడు గిగా ఫ్యాక్టరీల్లో ఒకటి 10 గిగావాట్ సిలికాన్ ఆధారిత ఫోటోవోల్టిక్ ఉత్పత్తి చేస్తుందని, మరోకటి 10 గిగావాట్ విండ్ టర్బైన్ తయారీ కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరోకటి 5 గిగావాట్ ఫ్యాక్టరీని హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి కోసం నిర్మించనున్నట్లు వివరించారు.
డేటా సెంటర్స్ బిజినెస్
దేశంలో డేటా సెంటర్స్ బిజినెస్ భారీగా పెరుగుతుందని చెప్పారు. ఈ కేంద్రాలు అత్యధిక ఎనర్జీని వినియోగిస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము గ్రీన్ డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్ల అదానీ వివరించారు. ఈ డేటా సెంటర్స్‌ను ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేసేందుకు వీలుగా సముద్ర గర్భంలో కేబుల్స్ వేయనున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ రూపొందింనున్న సూపర్ యాప్‌లో తమ బీ2సీ కస్టమర్లందరూ కనెక్ట్ అవుతారని చెప్పారు. అదానీ గ్రూప్ ఆద్వర్యంలో నడుస్తున్న వందలాది సోలార్, విండ ఎనర్జీ సెంటర్లను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తయిందని చెప్పారు. ఇది త్వరలోనే ప్రపంచంలోనే ఏ1 ల్యాబ్‌గా అవతరించనుందని చెప్పారు. అదానీ గ్రూప్‌లోని కంపెనీలు ఇప్పటికే ప్రపంచంలోనే కొన్ని అగ్రస్తానంలో ఉన్నాయి. దేశంలోనే అదానీ గ్రూప్ అత్యధిక విమానాశ్రయాలు కలిగి ఉంది. అత్యధిక పోర్టులు కలిగి ఉంది. అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఆయన ఆధీనంలో ఉంది. దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆయన అవతరించారు. దేశంలోనే అతి పెద్ద ఎనర్జీ కంపెనీ అదానీ గ్రూప్‌లో ఉంది. భారత్‌లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, దేశంలో నిజమైన అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని అదానీ చెప్పారు. ఇండియా అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి కంపెనీలకు ఇదే మంచి అవకాశమని ఆయన చెప్పారు. దేశంలో నిపుణులైన యువతకు కొరతలేదన్నారు.
చైనా ఒంటరవుతోంది
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఒడుదొడుకులు భారత్‌కు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టిందని గౌతమ్ అదానీ చెప్పారు. భారత వృద్ధికి ఎనలేని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. భారత్ వచ్చే 30 సంవత్సరాల్లో ప్రపంచంలపై గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రస్తుతం గ్లోబలైజేషన్ ఛాంపియన్‌గా ఉన్న చైనా సవాళ్లు ఎదుర్కోనుందని చెప్పారు. చైనా క్రమంగా ఏకాకిగా మిగులుతుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జాతీయ వాదం, సప్లయ్ చైన్ అవరోధాలు, టెక్నాలజీ పరిమితులు వంటివి ఈ దేశంపై ప్రభావం చూపనున్నాయని చెప్పారు. చైనా చేపట్టిన బెల్డ్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్‌కు సైతం వివిధ దేశాల్లో ప్రతిఘటన ఎదురవుతోందని చెప్పారు. చైనా లక్ష్యలకు ఇది అవరోధంగా మారిందని చెప్పారు.
పేదరికం లేని దేశంగా భారత్
రత్ 2050 నాటికి వంద శాతం పేదరికంలేని దేశంగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదుగుతుందన్నారు. దేశానికి స్వాంత్రత్యం వచ్చిన తరువాత 1 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదగడానికి 58 సంవత్సరాలు పట్టిందని, 2 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదిగేందుకు 12 సవత్సరాలు , 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామిగా ఎదిగేందుకు 5 సంవత్సరాల సమయం పట్టిందని అదానీ చెప్పారు. ఇప్పుడు డిజిటల్ విప్లవం వల్ల 30 ట్రిలియన్ ఎకనామిగా ఎదిగేందుకు ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో వేలాది మంది కొత్త పారిశ్రామికవేత్తలు తయారవుతున్నారని చెప్పారు. ఒక యూనికార్న్ ఆవిర్భవిస్తే, దానికి అనుబంధంగా డజన్ మైక్రో యూనికార్న్‌లు వస్తున్నాయని చెప్పారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా 100 బిలియన్లు దాటే అవకాశం ఉందని అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు.