వచ్చే 2023 సంవత్సరం అన్ని విధాలుగా ఆకర్షణీయ పనితీరును నమోదు చేస్తామన్న నమ్మకాన్ని భారతీయ కంపెనీలు వ్యక్తం చేశాయి. వేతనాల్లోనూ రెండంకెల వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయని ఒక సర్వేలో పేర్కొంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్‌సీ ఈ సర్వే నిర్వహించింది. 40 రంగాలకు చెందిన 13 వందల కంపెనీల నుంచి ఈ సంస్థ అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించింది. అంతర్జాతీయ మాంద్యం భయాలు, దేశీయంగా ఆధిక ద్రవ్యోల్బణం లాంటి పలు ప్రతికూలతలు ఉన్నప్పటకీ దేశంలో వేతనాలు 10.4 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2022లో ఇప్పటి వరకు నమోదైన 10.6 శాతం వృద్ధి కంటే ఇది తక్కువ. ఫిబ్రవరిలో ఈ సంస్థ అంచనా వేసిన 9.9 కంటే ఇది ఎక్కువ. బలమైన వ్యాపార పనితీరు కనబరుస్తామని కంపెనీల్లో నెలకొన్న నమ్మకానికి వేతనాల్లో వృద్ధి అంచనాలే నిదర్శనమని సర్వే పేర్కొంది.
వల సల రేటు 2022 తొలి అర్ధభాగంలో 20.3 శాతం ఉంటే, 2021లో ఇది 21 శాతం ఉంది. దీని వల్లే వేతనాలపై ఒత్తిడి కొనసాగుతుందని నివేదిక తెలిపింది. రానున్న కాలంలోనూ ఇదే ధోరణి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎక్కువ వేతనాలు పెరిగే అవకాశం ఉన్న ప్రతి 5 కంపెనీల్లో నాలుగు సాంకేతిక రంగానికి చెందినవే ఉన్నాయి. 12.8 శాతం వేత పెంపుతో ఇ-కామర్స్ రంగంలో మొదటి స్థానంలో ఉంది. 12.7 శాతం పెంపుతో అంకురాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 11.3 శాతం వేతన పెంపుతో ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, 10.7 శాతం పెంపుతో ఆర్ధిక సేవల రంగాలు ఉన్నాయి.