BULDING | సచివాలయం.. నిరుపయోగం!
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా భవనం
నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలంటున్న అయ్యలూరు గ్రామ ప్రజలు
BULDING | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రమైన నంద్యాలకు (Nandyal) ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అయ్యలూరు గ్రామ సచివాలయం -2 నూతన భవనం నిరుపయోగంగా ఉంది. గత ఎన్నికల ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి కాకుండానే హడావిడిగా అప్పటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 2024 మార్చి 13వ తేదీన ప్రారంభించారు. ఎంజిఎన్‌ఆర్ ఈజీఎస్ పథకం కింద ప్రభుత్వం 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అయ్యలూరు గ్రామ సచివాలయం -2 నూతన భవనాన్నినిర్మించారు.
అయితే పనులు పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల (Election) ముందు హడావిడిగా ప్రారంభం చేసి చేతులు దులుపుకుంది. అధికారంలోకి వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం 18 నెలలైనా ఈ భవనం వైపు చూడకుండా తమకు పట్టనట్టు ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామానికి దూరంగా ఉన్న ఈ నూతన గ్రామ సచివాలయ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం పెండింగ్ పనులకు నిధులు కేటాయించి సచివాలయంను ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని అయ్యలూరు గ్రామస్థులు కోరుతున్నారు.
నంద్యాల మండల ఇంజనీర్ శివ శంకర్ ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ… గ్రామానికి దూరంగా ఓ ప్రయివేట్ (Private) వెంచర్‌లో గ్రామ సచివాలయానికి కేటాయించిన స్థలంలో గత ప్రభుత్వం సుమారు రూ. 40 లక్షలు ఖర్చు చేసి అయ్యలూరు గ్రామ సచివాలయం -2 నూతన భవనం నిర్మించిందని, పనులు అసంపూర్తిగా ఉండడడం వల్ల వాడుకలోకి లేదన్నారు. కరెంటు, ఇన్ సైడ్ స్టీల్ రైయింగ్ పనులు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ప్రధాన గేటు ఏర్పాటుకు ప్రభుత్వంకు సుమారు రూ. 4 లక్షల అంచనా తయారు చేసి ప్రతిపాదన పంపామన్నారు. నిధులు విడుదల కాగానే పనులు పూర్తి చేసి అయ్యలూరు గ్రామ సచివాలయం -2 ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మండల ఇంజనీర్ శివ శంకర్ వివరించారు.

