Budgets | ఒక్క మంచి పని జరగలేదు…
Budgets | ఒక్క మంచి పని జరగలేదు…
- వైసీపీ అధినేత వైఎస్ జగన్
Budgets | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు బడ్జెట్లు పెట్టినా… ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో భీమవరంలో పార్టీ నేతలతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవేనని తెలిపారు. సంక్రాంతి సమయంలో కోడి పందేలకు వేలం నిర్వహించారని ఆరోపించారు. చివరికి తన నియోజకవర్గం పులివెందులలోనూ కోడి పందాలకు వేలం పెట్టారని గుర్తు చేశారు.
ప్రభుత్వమే అన్ని దగ్గరుండి చేయిస్తే శాంతిభద్రతలు ఏమవుతాయని ప్రశ్నించారు. బరితెగింపులకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఏపీ జంగిల్ రాజ్‌గా మారిందని, కూటమి ఎమ్మెల్యేలు దిగజారారని జగన్ అన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసలు అతడు మనిషేనా? ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే, ఏ చర్యా లేదన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేసిందని, అయినా ఏ చర్య లేదన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే మహిళను వేధింపులకు గురిచేసినా, చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు.
ఇక మంత్రి వాసంశెట్టి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలా చంద్రబాబు, లోకేశ్ అండతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం కూడా ఇలాగే చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో చంద్రబాబు రూ. 3 లక్షల కోట్లు అప్పు చేశారని.. ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
