లారీ ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం
సీతాగొంది జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. స్నేహితుడికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ జాదవ్ సాయి (28) మృతి చెందారు.
వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న ఆయన స్నేహితుడు ఓంకార్ తీవ్రంగా గాయపడ్డారు. చూడ మండలం జామిడి గ్రామానికి చెందిన సాయి ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చారు.
దీపావళి పండుగ కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడు ఓంకార్‌తో కలిసి బుధవారం ఆదిలాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఓంకార్‌ను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పండుగ కోసం వెళ్లిన యువ జవాన్ ప్రమాదంలో మృతి చెందడంతో జామిడి గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
