సికింద్రాబాద్‌లో దారుణ హత్య..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. తుకారాం గేట్ ప్రాంతంలో వినాయక మండపం వద్ద కార్తీక్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ప్రేమ జంటకు కార్తీక్ సహాయం చేశాడని, యువతి తన ప్రియుడితో వెళ్లిపోవడంతో అప్పటి నుంచి కక్ష పెంచుకున్న వ్యక్తులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
పండుగ వాతావరణంలో ప్రజలు రద్దీగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కార్తీక్‌తో ఇటీవల గొడవలు జరిగిన వ్యక్తులు, గతంలో ఉన్న వివాదాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత కక్షతోనే ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
